Apple | యాపిల్ కంపెనీ గురించి చెప్పగానే మనకు ముందు గుర్తొచ్చేది ఐఫోన్. క్వాలిటీ విషయంలో కానీ.. ఫోన్ ఫీచర్ల విషయంలో కానీ.. యాపిల్ ఫోన్‌ను మించిన ఫోన్ లేదు. ఇప్పటి వరకు యాపిల్ ఫోన్‌ను ఢీకొట్టిన ఫోన్ లేదు. పెద్ద పెద్ద కంపెనీలు కూడా యాపిల్ తరహా ఫోన్‌ను తయారు చేయలేక.. వెనక్కి తగ్గాయి. యాపిల్ అంటేనే యూనిక్‌నెస్. అందుకే.. యాపిల్ ప్రాడక్ట్స్‌కు ప్రపంచవ్యాప్తంగా అంత డిమాండ్. ముఖ్యంగా ఐఫోన్ అంటే పడిచచ్చిపోతారు జనాలు. లక్ష అయినా రెండు లక్షలు అయినా.. కొత్త మోడల్ రిలీజ్ అయితే చాలు.. ఎగబడి మరీ కొంటారు. అది యాపిల్ ఫోన్లకు ఉన్న డిమాండ్.
ఆ డిమాండ్.. ఆ క్రేజీనెస్ వల్లనే ఇప్పుడు యాపిల్ మరో కొత్త మైలురాయికి చేరుకుంది. ప్రపంచంలోనే తొలి 3 ట్రిలియన్ యూఎస్ డాలర్ల కంపెనీగా అవతరించింది. ప్రస్తుతం యాపిల్ కంపెనీ మార్కెట్ విలువ 3 ట్రిలియన్ యూఎస్ డాలర్లు అన్నమాట. అంటే మన కరెన్సీలో సుమారు 224 లక్షల కోట్ల రూపాయలు అన్నమాట.
వాటిని అంకెల్లో రాస్తే చదవడానికే చాలా సమయం పడుతుంది. పబ్లిక్‌లో ట్రేడ్ అవుతున్న కంపెనీలలో భారీ మార్కెట్ వాల్యూను సొంతం చేసుకున్న కంపెనీలలో తొలి స్థానాన్ని యాపిల్ ఆక్రమించింది. అయితే ఒక్కసారిగా యాపిల్ కంపెనీ మార్కెట్ వాల్యూ పెరగడానికి కారణం.. దాని షేర్ వాల్యూ పెరగడమే. కేవలం మూడు శాతం షేర్ వాల్యూ పెరగడం వల్ల.. 182.88 యూఎస్ డాలర్ల వాల్యూతో 3 ట్రిలియన్ డాలర్ మార్క్‌ను అందుకుంది. ఇదివరకు యాపిల్ షేర్ వాల్యూ 182.85 డాలర్లుగా ఉండేది.
ఆగస్టు 2018లోనే యాపిల్ మార్కెట్ వాల్యూ 1 ట్రిలియన్ యూఎస్ డాలర్లను క్రాస్ చేసింది. 2020 ఆగస్టులో 2 ట్రిలియన్ యూఎస్ డాలర్లను క్రాస్ చేసింది. 2021లో దాదాపు 35 శాతం యాపిల్ షేర్లు ఎగబాకాయి.
గత సంవత్సరం రిలీజ్ అయిన యాపిల్ 13 ఫోన్ల వల్ల కంపెనీ షేర్ వాల్యూ ఒక్కసారిగా పెరిగింది. అలాగన యాపిల్ టీవీ ప్లస్, ఐక్లౌడ్, యాపిల్ మ్యూజిక్, యాప్ స్టోర్ లాంటి సర్వీసుల ఉపయోగం పెరగడం వల్ల యాపిల్ షేర్ వాల్యూ పెరుగుతూ వచ్చింది.
యాపిల్ తర్వాత స్థానాల్లో మైక్రోసాఫ్ట్, గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ ఉన్నాయి. మైక్రోసాఫ్ట్ ప్రస్తుత మార్కెట్ వాల్యూ 2.5 ట్రిలియన్ డాలర్లు కాగా.. ఆల్ఫాబెట్ మార్కెట్ వాల్యూ 2 ట్రిలియన్లుగా ఉంది. ఆ తర్వాత 1.7 ట్రిలియన్ డాలర్లతో అమెజాన్, 1.2 ట్రిలియన్ డాలర్లతో టెస్లా కంపెనీలు ఉన్నాయి.