న్యూఢిల్లీ, జనవరి 4: ఐఫోన్ తయారీ కంపెనీ యాపిల్ గొప్ప ఘనతను సాధించింది. యాపిల్ మార్కెట్ విలువ 3 ట్రిలియన్ డాలర్ల (దాదాపు రూ.225 లక్షల కోట్లు)కు చేరింది. కార్పొరేట్ ప్రపంచంలో ఇంతటి విలువను పొందిన తొలి కంపెనీగా రికార్డులకెక్కింది. సోమవారం రాత్రి అమెరికా స్టాక్ మార్కెట్లో యాపిల్ షేరు చరిత్రాత్మక గరిష్ఠ స్థాయి 182.88 డాలర్ల వద్దకు పెరగడంతో కంపెనీ విలువ 3 ట్రిలియన్ డాలర్ల మార్క్‌ను తాకింది. గతేడాది అక్టోబర్‌లో కనిష్ఠ స్థాయి 140 డాలర్ల నుంచి యాపిల్ షేరు వేగంగా ర్యాలీ జరపడంతో కేవలం మూడు నెలల్లో 700 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువను పెంచుకోగలిగింది. యాపిల్ విలువ 2 ట్రిలియన్ డాలర్ల స్థాయి నుంచి 3 ట్రిలియన్ డాలర్లకు చేరడానికి 17 నెలల సమయం పట్టింది. 2020 తొలినాళ్లలో కొవిడ్ లాక్డౌన్ల సమయంలో నమోదైన కనిష్ఠ స్థాయి నుంచి ఈ షేరు 200 శాతంపైగా పెరిగింది. కొవిడ్‌తో వర్క్ ఫ్రం హోం, ఆన్లైన్ ఫైనాన్స్, విద్య, వినోదాలకు ప్రాధాన్యత పెరిగిన నేపథ్యంలో యాపిల్ ఉత్పత్తులు అంతర్జాతీయంగా మరింత ప్రాచుర్యం పొందాయి. ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్‌ను విడుదల చేస్తూ అమ్మకాల వృద్ధిని కొనసాగించగలగడం, నగదు నిల్వల్ని భారీగా పెంచుకోవడం వంటి కారణాలతో యాపిల్ షేర్లకు ఇన్వెస్టర్ల కొనుగోళ్ల మద్దతు లభిస్తున్నది. 2018 సంవత్సరం మధ్యలో తొలిసారిగా 1 ట్రిలియన్ డాలర్లకు చేరిన యాపిల్ విలువ.. 2020 ఆగస్టులో 2 ట్రిలియన్ డాలర్లకు పెరిగింది. కాగా 2 ట్రిలియన్ డాలర్ల విలువను ఆర్జించిన తొలి ప్రపంచ కంపెనీ చమురు దిగ్గజం సౌదీ ఆరామ్కో.