Apple-iPhone-15 Pro | గత నెల 12న మార్కెట్లో ఆవిష్కరించిన ఐ-ఫోన్ 15 ప్రో మోడల్ ఫోన్లు వేడెక్కుతున్న మాట వాస్తవమేనని ఆపిల్ అంగీకరించింది. కొత్తగా ఆవిష్కరించిన ఐ-ఫోన్ 15 ప్రో ఫోన్లు ఓవర్ హీట్‌తో కనీసం టచ్ కూడా చేయలేకపోతున్నామని పలువురు యూజర్లు ఫిర్యాదు చేశారు. యూజర్ల ఫిర్యాదు నిజమేనని అంగీకరించిన ఆపిల్.. దానికి కారణాలు కూడా వెల్లడించింది. ఆ ఫోన్లలోని సాఫ్ట్‌వేర్‌లో ‘బగ్’ సమస్య ఉందని, దాన్ని పరిష్కరిస్తామని తెలిపింది. కంఫర్టబుల్‌గా ఐ-ఫోన్15 ప్రో పని చేసేందుకు వీలుగా ఐఓఎస్ 17 (iOS 17) అప్ డేట్ విడుదల చేస్తామని వివరించింది.
యూజర్లు అత్యంత పాపులర్ యాప్స్ ఇన్ స్టాగ్రామ్, ఉబర్ వంటి థర్డ్ పార్టీ యాప్స్ వాడుతున్నప్పుడు బగ్, ఇతర సమస్యలు తలెత్తున్నాయని తెలిపింది. కానీ ఐ-ఫోన్ 15 ప్రో ఫోన్‌కు వాడిన టైటానియం ఫ్రేమ్ అందుకు కారణం కాదని ఆపిల్ స్పష్టం చేసింది. ఐ-ఫోన్లపై స్టెయిన్లెస్స్టీల్ ఫ్రేమ్ వాడకంపై వ్యతిరేకత రావడం వల్లే ఆపిల్.. ఈ దఫా టైటానియం ఫ్రేమ్ తీసుకొచ్చింది.
పలువురు యూజర్లు గేమ్స్ ఆడుతున్నా.. వీడియో కాల్స్ మాట్లాడుతున్నా, సినిమాలు చూస్తున్నా ఫోన్ వెనుక భాగం బాగా వేడెక్కుతున్నదని ఐ-ఫోన్ 15 ప్రో యూజర్లు ఆపిల్‌కు ఫిర్యాదులు చేశారు. మెటా ఆధ్వర్యంలోని ఇన్స్టాగ్రామ్ ఇటీవలే అప్ డేట్ చేసింది. మరోవైపు ఉబెర్ ఇతర అప్లికేషన్, అస్ఫాల్ట్9 అనే వీడియో గేమ్ అప్ డేట్ ప్రక్రియ కొనసాగుతున్నదని వార్తలొస్తున్నాయి. కొన్ని రోజులు వాడిన తర్వాత క్లౌడ్‌లో డేటా బ్యాకప్ స్టోరేజీ చేయడంతో ఐ-ఫోన్ 15 ప్రో ఫోన్లు వేడెక్కుతున్నాయని తెలుస్తున్నది.