న్యూఢిల్లీ, ఆగస్టు 29: దేశవ్యాప్తంగా కనెక్టెడ్ కేర్ కార్యక్రమాన్ని విస్తరిస్తున్నట్టు అపోలో గ్రూప్ తెలియజేసింది. దేశంలో అతిపెద్ద కనెక్టెడ్ హెల్త్‌కేర్ ఎకోసిస్టమ్ ఏర్పాటే ఈ ప్రోగ్రామ్ లక్ష్యమన్నది. ఈ కార్యక్రమంతో మెట్రో, నాన్-మెట్రో నగరాల్లో దవాఖానలు, నర్సింగ్ హోంల సాధికారతకు కృషి చేస్తామని ఓ ప్రకటనలో వివరించింది.
ఇక ఈ కార్యక్రమంలో భాగంగా అపోలోతో భాగస్వామ్యాన్ని ఏర్పర్చుకున్న దవాఖానల్లో అత్యుత్తమ వైద్య సేవలు అందుబాటులో ఉంటాయి. ఈఐసీయూ, డయాగ్నోస్టిక్స్, సర్జికల్ కన్సల్టేషన్స్, రిమోట్ మానిటరింగ్, క్లినికల్, క్వాలిటీ ట్రైనింగ్, అక్రిడిటేషన్ సపోర్ట్ వంటి సేవలు అందుతాయని అపోలో వ్యవస్థాపక చైర్మన్ ప్రతాప్ సీ రెడ్డి తెలిపారు.