Hotel @ Yadadri | తెలంగాణకే తలమానికం.. ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి వద్ద వసతుల కల్పనకు ఏర్పాట్లు ముమ్మరం అయ్యాయి. యాదాద్రి దేవాలయానికి సమీపంలో ఫోర్ స్టార్ జోన్ కనెక్ట్ హోటల్ నిర్మాణానికి లక్ష్మీ నివాసం డెవలపర్స్, అపీజేయ్ సురేంద్ర పార్క్ హోటల్స్ జత కట్టాయి. 400 విలాసవంతమైన సూట్లు గల ఈ హోటల్‌ను పార్క్ హోటల్స్ నిర్వహించనున్నాయి.
లక్ష్మీ నివాసం డెవలపర్స్ చైర్మన్ రాజేంద్ర ప్రసాద్ ఈ సందర్భంగా మాట్లాడుతూ 2022 మార్చి నాటికి తొలి దశలో 140 రూమ్‌లను ప్రారంభిస్తామని చెప్పారు. దేవాలయానికి కేవలం 2.4 కిలోమీటర్ల దూరంలోనే ఈ హోటల్ ఏర్పాటవుతున్నది. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునేందుకు ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే భక్తులు, సందర్శకులకు వసతి కేంద్రంగా ఈ హోటల్ నిలుస్తుందన్నారు. సమీప భవిష్యత్‌లో తాము సంయుక్తంగా అయోధ్య, మదురైల్లో హోటల్స్ నిర్మాణానికి గల అవకాశాలను పరిశీలిస్తామన్నారు. లక్ష్మీ నివాసం డెవలపర్స్ ప్రస్తుతం యాదాద్రి వద్ద విల్లాలు, ప్లాట్ల డెవలప్మెంట్ ప్రాజెక్టులు చేపడుతోంది.
తెలంగాణ ప్రభుత్వం అధ్యాత్మికతకు చాలా ప్రాధాన్యం ఇస్తున్నదని రాజేంద్ర ప్రసాద్ చెప్పారు. 2022 మార్చి 28 తర్వాత రాష్ట్రం టీఎస్ ఎస్ పాస్ (స్పిరిచ్యువల్ పాస్)కు పెట్టింది పేరుగా నిలుస్తుందన్నారు. సమీప భవిష్యత్‌లో రాష్ట్ర సీఎం ప్రపంచానికి 13వ అల్వార్గా నిలుస్తారన్నారు. పార్క్ నేషనల్ హెడ్ వికాశ్ అహ్లువాలియా మాట్లాడుతూ భారతదేశం అంతటా అధ్యాత్మిక సర్క్యూట్లకు ప్రాధాన్యం ఏర్పడిందన్నారు.