Hyderabad | హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ): చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మరో పార్క్‌ను ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది. మేడ్చల్ జిల్లాలోని ఘట్కేసర్ మండలంలోని మాదారం గ్రామ పరిధిలో సుమారు 200 ఎకరాల విస్తీర్ణంలో మరో ఎంఎస్ఎంఈ పార్క్‌ను అభివృద్ధి చేయబోతున్నది. ఇందుకు సంబంధించి టీఎస్ఐఐసీ భూసేకరణను పూర్తి చేసింది కూడా. త్వరలో లేఔట్లను రూపొందిస్తున్నారు. కొత్తగా ఏర్పాటు చేయనున్న పార్క్‌నకు ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానించనున్నది. పలు రకాల భారీ పరిశ్రమలకు యాన్సిలరీ యూనిట్లు ఏర్పాటు చేసుకునే విధంగా జనరల్, ఇంజినీరింగ్ యూనిట్లకు స్థలాలు కేటాయించాలని టీఎస్ఐఐసీ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం కాప్రా, చర్లపల్లి తదితర నివాస ప్రాంతాల్లో అనేక సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు కొనసాగుతున్నాయి. వీటిలో ఎక్కువగా ఏరోనాటికల్, రక్షణ రంగాలకు సంబంధించిన సంస్థలు ఉన్నాయి.
అయితే ఇవన్నీ జీహెచ్ఎంసీ పరిధిలో నివాస ప్రాంతాల్లో ఉండటంతో వీటికి అనుమతులు, సబ్సిడీలు రావడం లేదు. ఫలితంగా ఈ ప్రాంతాల్లో ఉన్న చిన్న తరహా పరిశ్రమలు నిర్వహిస్తున్నవారు ఎంతోకాలంగా తమకు స్థలాలు కేటాయించాలని పలుమార్లు టీఎస్ఐఐసీని కోరినప్పటికీ ఫలితం లేకపోయింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల ప్రకారం టీఎస్ఐఐసీ..మాదారం గ్రామ పరిధిలోని సుమారు 200 ఎకరాల స్థలానిన సేకరించింది. ఇటీవల జిల్లా కలెక్టర్ భూములను టీఎస్ఐఐసీకి బదలాయించడంతో అధికారులు లేఔట్ల ఏర్పాటులో నిమగ్నమయ్యారు. ఈ ప్లాన్ సిద్ధం కాగానే ఓ వైపు రోడ్లు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తూనే, మరోవైపు ఆన్లైన్ ద్వారా ప్లాట్ల కేటాయింపు చేపట్టాలని నిర్ణయించారు. ఇప్పటికే కాప్రా, చర్లపల్లి ప్రాంతాల్లో చిన్నతరహా పరిశ్రమలు నడుపుకుంటున్నవారు తమకు ప్రాధాన్యత కల్పించాలని కోరుతుండగా.. అధికారులు మాత్రం నిర్ధారిత మార్గదర్శకాల ప్రకారం అర్హులైనవారికి ప్లాట్ల కేటాయింపు ఉంటుందని స్పష్టంచేస్తున్నారు. ఈ పార్క్ సిద్ధమైతే ప్రత్యక్షంగా 20 వేల మందికి, పరోక్షంగా 30 వేల మందికి ఉపాధి లభించనున్నాయని, అలాగే రూ.2 వేల కోట్లకు పైగా పెట్టుబడులు రావచ్చునని అంచనా.