హైదరాబాద్, జూన్ 17: ఆఫ్రికాకు చెందిన అతిపెద్ద విమానయాన సంస్థ ఇథియోపియాన్..వ్యాపార విస్తరణలో భాగంగా భారత్‌లో మరో రూట్‌కు విమాన సర్వీసును అందుబాటులోకి తీసుకొచ్చింది. హైదరాబాద్ నుంచి ఇథియోపియా రాజధాని అడ్డిస్ అబాబాకు మధ్య డైరెక్ట్ ఫ్లైట్ సర్వీసును మంగళవారంప్రారంభించింది. దక్షిణ భారతం నుంచి ఆఫ్రికా దేశాల మధ్య ప్రయాణించేవారికోసం ఈ నూతన విమాన సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు కంపెనీ సీఈవో మెస్ఫిన్ తసెవ్ తెలిపారు. వారానికి మూడు రోజులపాటు ఈ సర్వీసు నడపనున్నది. హైదరాబాద్‌లో ఈటీ 683 నంబర్ కలిగిన ఫ్లైట్ సర్వీసు మంగళ, గురు, శనివారాల్లో నడవనుండగా, అడ్డిస్ అబాబాలో సోమ, బుధ, శుక్రవారాలు బయలుదేరనున్నది. భారత్‌లో విమాన సేవలు అందిస్తున్న ఐదో నగరంగా హైదరాబాద్ నిలిచిందన్నారు.