హైదరాబాద్, జూన్ 12: దివాలా ప్రక్రియలో ఉన్న వైస్రాయ్ హోటల్స్ (వీహెచ్ఎల్) టేకోవర్ కోసం అనిరుధ్ ఆగ్రో ఫామ్స్ (ఏఏఎఫ్ఎల్) సమర్పించిన పునరుద్ధరణ ప్రణాళికను నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) హైదరాబాద్ బెంచ్ తిరస్కరించింది. వీహెచ్ఎల్ విక్రయానికి మళ్లీ తాజాగా బిడ్స్ ఆహ్వానించాలని రిజల్యూషన్ ప్రొఫెషనల్‌ను ఆదేశించింది. అనిరుధ్ ఆగ్రో ప్రణాళికను 95.82 శాతం రుణదాతలు ఆమోదించినప్పటికీ, ఆ సంస్థ సమర్పించిన బ్యాంక్ గ్యారంటీలు మురిగిపోయిన నేపథ్యంలో తిరస్కారం ఎదురయ్యింది.
వైస్రాయ్ హోటల్స్‌కు హైదరాబాద్‌లో రెండు ప్రాపర్టీలు ఉన్నాయి. వాటిలో ఒకదానిలో మారియట్ గ్రూప్ ఫైవ్‌స్టార్ హోటల్‌ను నిర్వహిస్తుండగా, మరోదానిలో త్రీస్టార్ హోటల్ నడుపుతున్నది. రుణదాతలు సమర్పించిన రూ. 714.24 కోట్ల క్లెయింలను అడ్మిట్ చేసుకున్న తర్వాత రిజల్యూషన్ ప్రొఫెషనల్ గోవిందరాజుల వెంకట నరసింహారావు రుణదాతల కమిటీని ఏర్పాటుచేసి ప్రక్రియను ప్రారంభించారు.