హైదరాబాద్, జనవరి 14: ఖాయిలా సంస్థ ఆంధ్రా సిమెంట్ కొనుగోలుకు జరిగిన బిడ్డింగ్‌లో తాము విజయవంతమైన బిడ్డర్‌గా నిలిచామని సాగర్ సిమెంట్స్ ప్రకటించింది. ఈ మేరకు ఎన్సీఎల్టీ నియమిత రిజొల్యూషన్ ప్రొఫషనల్ నుంచి తమకు సమాచారం అందిందని సాగర్ సిమెంట్ శనివారం స్టాక్ ఎక్సేంజీలకు తెలిపింది. లెటర్ ఆఫ్ ఇంటెంట్ (ఎల్ఓఐ) కూడా తమకు జారీఅయ్యిందన్నది.
జేపీ గ్రూప్ కంపెనీ అయిన ఆంధ్రా సిమెంట్ కొనుగోలుకు సాగర్ సిమెంట్స్‌తో పాటు బీసీ జిందాల్ గ్రూప్ కంపెనీ జిందాల్ పాలీ ఫిల్మ్స్, దాల్మియా సిమెంట్, ఖండ్వాలా ఫిన్స్టాక్లు ఆసక్తి వ్యక్తీకరణ (ఈవోఐ) బిడ్స్‌ను సమర్పించాయి. బ్యాంక్‌ల నుంచి తీసుకున్న రుణాల చెల్లింపుల్లో విఫలం కావడంతో ఆంధ్రా సిమెంట్స్‌పై దివాలా ప్రక్రియను అమలు జరిపేందుకు ఎన్సీఎల్టీ (నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్) హైదరాబాద్ బెంచ్ ఆదేశించింది. రిజొల్యూషన్ ప్రొఫెషనల్‌గా నీరవ్ పూజారాను నియమించింది. ఆంధ్రా సిమెంట్స్ 2012 నుంచి 2016 వరకూ ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, కరూర్ వైశ్యా బ్యాంక్‌లతో సహా పలు బ్యాంక్‌ల నుంచి రుణాలు తీసుకున్నది. తదుపరి అవి మొండి బకాయిలుగా మారాయి.