Vistara | విస్తారా ఎయిర్ లైన్స్‌లో సంక్షోభం నేపథ్యంలో 15 మంది సీనియర్ పైలట్లు రాజీనామా చేశారని కంపెనీ వర్గాలు మంగళవారం తెలిపాయి. వేతన సవరణ విషయమై కొందరు పైలట్లు నిరసన తెలుపుతున్నారు. దీంతో కొన్ని వారాలుగా విస్తారా యాజమాన్యం పలు విమాన సర్వీసులు రద్దు చేస్తున్నది. దీనిపై వివరణ ఇవ్వాలని విస్తారా యాజమాన్యాన్ని డీజీసీఏ ఆదేశించింది. విస్తారా ఎయిర్ లైన్స్ లో నెలకొన్న పరిస్థితిని కేంద్ర పౌర విమానయానశాఖ కూడా పర్యవేక్షిస్తున్నది.
టాటా సన్స్ అనుబంధ సంస్థ విస్తారా ఎయిర్ లైన్స్‌ను మరో అనుబంధ సంస్థ ఎయిర్ ఇండియాలో విలీనం నేపథ్యంలో విస్తారా పైలట్లకు నూతన వేతన సవరణ కాంట్రాక్టుల్లో తేడాలు తలెత్తాయి. ఎక్కువ సమయం విధులు నిర్వహిస్తున్నా, ఫిక్స్డ్ పరిహారం తగ్గించడంపై విస్తారా పైలట్లు నిరసన బాట పట్టాయి.
తాజాగా వైడ్ బాడీ బోయింగ్ 787 విమానాల నిర్వహణ కోసం శిక్షణ పొందారు విస్తారా పైలట్లు. కానీ శిక్ష పూర్తయిన తర్వాత సుమారు 800 మంది పైలట్లు, సీనియర్ ఫస్ట్ ఆఫీసర్లు రాజీనామా చేయడం ప్రాధాన్యం సంతరించుకున్నది. విస్తారా పైలట్ల రాజీనామాపై యాజమాన్యం స్పందించడానికి నిరాకరించింది. 70 విమానాలతో ప్రతి రోజూ 300కి పైగా విమాన సర్వీసులు నడుపుతున్నది.