న్యూఢిల్లీ, సెప్టెంబర్ 21: దేశీయ ఆతిథ్య సేవల సంస్థ ఆయో…అగ్రరాజ్యం అమెరికాలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి సిద్ధమైంది. అమెరికాలోని బడ్జెట్ హోటల్ చెయిన్ మోటల్ 6, స్టూడియో 6 బ్రాండ్ హోటళ్లను నడుపుతున్న జీ6 హాస్పిటాల్టీని కొనుగోలు చేయబోతున్నది. జీ6లో పెట్టుబడులు పెట్టిన బ్లాక్ స్టోన్ రియల్ ఎస్టేట్ నుంచి 525 మిలియన్ డాలర్ల(రూ.4,300 కోట్లకు పైమాటే)కు కొనుగోలు చేయబోతున్నట్లు ఓయో మాతృ సంస్థ ఓర్వల్ స్టేస్ ప్రకటించింది.
పూర్తిస్థాయిలో నగదు రూపంలో జరగనున్న ఈ ఒప్పందం ఈ ఏడాది నాలుగో త్రైమాసికం నాటికి పూర్తికాగలదనే విశ్వసాన్ని ఓయో వ్యక్తం చేసింది. మోటల్ 6 గడిచిన ఏడాదికాలంలో 1.7 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించింది. 2019లో అమెరికాలో అడుగుపెట్టిన ఓయో..35 స్టేట్స్లో 320 హోటళ్లలో ఆతిథ్య సేవలు అందిస్తున్నది. కేవలం 2023లో 100 హోటళ్లను తన పరిధిలోకి తీసుకొచ్చిన సంస్థ..2024లోనే ఇదే పంతాను కొనసాగిస్తూ 250 హోటళ్లలో తన సేవలు అందిస్తున్నది.
ఈ సందర్భంగా ఓయో ఇంటర్నేషనల్ సీఈవో గౌతమ్ స్వరూప్ మాట్లాడుతూ.. అంతర్జాతీయ స్థాయిలో ఓ స్టార్టప్ కంపెనీ తన ఉనికి చాటుకోవడంతో ఈ కొనుగోలు కీలక మైలురాయిగా నిలుస్తుందని చెప్పారు. మోటల్ 6కు అమెరికాలో మంచి గుర్తింపువున్నదన్న ఆయన..ఓయోకున్న అనుభవంతో మరింత వృద్ధి సాధిస్తామన్న ధీమను వ్యక్తంచేశారు. ఈ కొనుగోలు సంస్థను వేరే సంస్థగా కొనసాగిస్తామన్నారు.