న్యూఢిల్లీ, ఆగస్టు 20: ఎడాపెడా టేకోవర్లు చేస్తూ సంచలనం సృష్టిస్తున్న గౌతమ్ అదానీ గ్రూప్ తాజాగా 13 బిలియన్ డాలర్ల (రూ.1,03,740 కోట్లు) విలువైన షేర్లను తనఖా పెట్టింది. రేవులు..విద్యుత్..ఎయిర్‌పోర్టులు తదితర వ్యాపారాల్లో శరవేగంగా విస్తరిస్తున్న ప్రపంచంలో నంబర్‌టూ శ్రీమంతుడైన గౌతమ్ అదానీ నిధుల కోసం అర్రులు చాస్తున్నారడానికి తార్కాణం ఇది. ఇటీవల స్విస్ సిమెంట్ దిగ్గజం హోల్సిమ్ నుంచి కొనుగోలు చేసిన అంబూజా సిమెంట్స్, ఏసీసీ పూర్తివాటాను తనఖా పెట్టారు. సోమవారం ఈ రెండు షేర్ల ముగింపు ధరల ఆధారంగా వీటి విలువ 13 బిలియన్ డాలర్లు.
అంబూజా సిమెంట్స్‌లో 63 శాతం, ఏసీసీలో 57 శాతం షేర్లు ‘కొన్ని బ్యాంక్‌లు, ఇతర ఫైనాన్షియల్ సంస్థల కోసం’ తనఖా ఉంచినట్లు డ్యూషే బ్యాంక్ హాంకాంగ్ శాఖ భారత స్టాక్ ఎక్సేంజీలకు సమాచారం ఇచ్చింది. గ్రీన్ ఎనర్జీ నుంచి మీడియా వరకూ పలు కొత్త రంగాల్లోకి ప్రవేశిస్తున్న అదానీ గ్రూప్ రుణభారం భారీగా ఉన్నదన్న ఆందోళనలు నెలకొన్న సమయంలో ఈ తనఖా జరిగింది. తనఖా ఒప్పందంపై అదానీ గ్రూప్‌కు చెందిన ఎండేవర్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్, ఎక్సెంట్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ సంతకాలు చేశాయి. హోల్సిమ్ ఇండియా సిమెంట్ వ్యాపారాలకు హోల్డింగ్ కంపెనీ అయిన మారిషస్‌లోని హోల్డర్రిండ్ ఇన్వెస్ట్మెంట్లో పూర్తివాటాను ఎండేవర్ ట్రేడ్ కొనుగోలు చేసేందుకు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ)ఆగస్టులో అనుమతినిచ్చింది.