హైదరాబాద్, నవంబర్ 25(నమస్తే తెలంగాణ): పలు దిగ్గజ కంపెనీలకు ఎలక్ట్రానిక్ వస్తువులు, విడిభాగాలు అందించే ‘అంబర్ – రెసోజెట్’ రాష్ట్రంలో రూ.250 కోట్ల పెట్టుబడులతో ఉత్పాదన ప్లాంట్లు ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. ఇందుకు సంబంధించి సోమవారం సచివాలయంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబును కలుసుకొని ఈ పెట్టుబడి ప్రతిపాదనను వివరించారు.
ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ..రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే సంస్థలకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించనున్నట్లు, అలాగే అంబర్-రెసోజెట్ సంస్థకు కూడా ప్రభుత్వపరంగా అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ఈ సందర్భంగా మంత్రి హామీ ఇచ్చారు.
వచ్చే మూడేండ్లలో రూ.250 కోట్ల పెట్టుబడితో ప్లాంట్‌ను నెలకొల్పడంతో ప్రత్యక్షంగా వెయ్యి మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని మంత్రి పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఉత్పత్తి యూనిట్లు ఉన్న అంబర్ తాజాగా హైదరాబాద్‌ను గమ్యస్థానంగా ఎంచుకున్నదని, ఇక్కడ త్వరలోనే అత్యాధునిక పీసీబీ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నదన్నారు.