Ambanis Family | దేశీయ కార్పొరేట్ రంగంలోనే అంబానీ కుటుంబం అత్యంత విలువైన కుటుంబంగా నిలిచిందని గురువారం ఓ సర్వే నివేదిక తెలిపింది. బార్క్లేస్ ప్రైవేట్ క్లయింట్స్ హురున్ ఇండియా ఈ సర్వే నిర్వహించింది. అంబానీ కుటుంబ వ్యాపార విలువ మొత్తం రూ.25.75 లక్షల కోట్లు అని ఆ సర్వే తెలిపింది. తర్వాతీ స్థానంలో బజాజ్ ఫ్యామిలీ వ్యాపార విలువ రూ.7.13 లక్షల కోట్లు కాగా, మూడో స్థానంలో ఉన్న బిర్లా కుటుంబ వ్యాపార విలువ రూ.5.39 లక్షల కోట్లు.
అదానీ ఫ్యామిలీ వ్యాపార విలువ రూ.15.44 లక్షల కోట్లు పలికినా ఫస్ట్ జనరేషన్ ప్రధాన జాబితాలో చోటు చేసుకోలేదు. సెకండ్ జనరేషన్ చురుగ్గా పని చేస్తున్న వ్యాపార కుటుంబాల్లో మాత్రం అదానీ ఫ్యామిలీ మొదటి స్థానంలో నిలిస్తే.. రూ.2.37 లక్షల కోట్లతో సీరం పూనవాలా కుటుంబం ఉంది.
విలువైన వ్యాపార కుటుంబాన్ని నిర్ధారించడానికి మార్చి 20 తేదీని గడువుగా నిర్ణయించారు. ఆయా వ్యాపార కుటుంబాల బిజినెస్‌ల్లో ప్రైవేట్ పెట్టుబడులు, లిక్విడ్ అసెట్స్‌ను మినహాయిస్తారు. గతేడాది కుటుంబాల వ్యాపార విలువతో పోలిస్తే నాలుగింట మూడొంతుల కుటుంబ వ్యాపారాల్లో వృద్ధిరేటు నమోదైందని హురున్ ఇండియా ఫౌండర్, చీఫ్ రీసెర్చర్ అనాస్ రహ్మాన్ జునయిద్ తెలిపారు. ఈ కుటుంబాలు వైవిధ్యభరితమైన పరిశ్రమల్లో గణనీయ పాత్ర పోషించడంతో దీర్ఘకాలికంగా దేశీయ వృద్ధిరేటు, ఆర్థిక సుస్థిరత కొనసాగడంతోపాటు ముందుకు వెళుతుందని పేర్కొన్నారు.