న్యూయార్క్ : టెక్ దిగ్గజాల లేఆఫ్స్ వార్తలు టెకీల్లో గుబులు రేపుతున్నాయి. ఆర్ధిక మందగమనం, మాంద్యం ముంచుకొస్తుందనే వార్తలతో కంపెనీలు కొలువుల కోతలకు దిగుతున్నాయి. ట్విట్టర్, మెటా తర్వాత తాజాగా ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ పలు విభాగాల్లో లేఆఫ్స్‌ను ప్రారంభించినట్టు తెలిసింది. అమెజాన్ ఏకంగా 10,000 మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగిస్తుందనే వార్తలు వచ్చిన నేపధ్యంలో లేఆఫ్స్ ఇప్పటికే షురూ అయినట్టు రిపోర్ట్స్ రావడంతో సిబ్బందిలో ఆందోళన వ్యక్తమవుతోంది. లేఆఫ్స్‌పై అమెజాన్ నోరు మెదపకపోయినా ఇప్పటికే జాబ్ కట్స్ ఊపందుకున్నాయని లింక్డిన్ పోస్టుల్లో ఉద్యోగులు వాపోతున్నారు.
అమెజాన్ ఉద్యోగులను వారి మేనేజర్లు మీటింగ్‌ల పేరుతో పిలిపించి రెండు నెలల్లోగా వేరే ఉద్యోగాలు చూసుకోవాలని తెగేసి చెబుతున్నట్టు సమాచారం. వివిధ విభాగాల్లో 10,000 మంది ఉద్యోగులను అమెజాన్ తొలగించనుందని వాల్‌స్ట్రీట్ జర్నల్ వెల్లడించిన క్రమంలో తాజా పరిణామాలు లేఆఫ్స్ తీవ్రతను వెల్లడిస్తున్నాయని టెక్ నిపుణులు చెబుతున్నారు. కంపెనీ నుంచి తమ నిష్క్రమణను తెలుపుతూ పలువురు ఉద్యోగులు లింక్డిన్ పోస్టుల్లో వివరిస్తున్నారు.
అమెజాన్ అలెక్సా వర్చువల్ అసిస్టెంట్ బిజినెస్, క్లౌడ్ గేమింగ్ ప్లాట్‌ఫామ్, కిండిల్ ఈ-రీడర్‌ను నిర్వహించే ల్యాబ్126 వంటి విభాగాలకు చెందిన ఉద్యోగులపై లేఆఫ్స్ ఎఫెక్ట్ అధికంగా ఉంది. తమ టీమ్ మొత్తాన్ని ఇంటికి పంపించారని అమెజాన్‌లో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మేనేజర్‌గా పనిచేసే ఓ ఉద్యోగి లింక్డిన్ పోస్ట్‌లో వాపోయారు. అమెరికాలో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ విభాగంలో పనిచేస్తున్న భారత సంతతి మహిళ తాను న్యూ జాబ్ రోల్స్‌కు సిద్ధంగా ఉన్నానని పోస్ట్ చేశారు. తన వీసా నిబంధనలను అనుసరించి నూతన ఉద్యోగావకాశాలకు పరిమిత సమయమే ఉందని ఆమె పేర్కొన్నారు.