Future- Amazon | అప్పుల ఊబిలో చిక్కుకున్న ఫ్యూచర్ రిటైల్‌లో అన్ని రిటైల్ ఆస్తులను కొనుగోలు చేసేందుకు రూ.7000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తితోనూ, కట్టుబడి ఉన్నామని అమెజాన్ తెలిపింది. ఈ మేరకు ఫ్యూచర్ రిటైల్‌లో ఇండిపెండెంట్ డైరెక్టర్లకు లేఖ రాసింది. ఈ విషయాన్ని సమరా క్యాపిటల్ ఆదివారం ధ్రువీకరించింది. ఈ నెల 19న తొలిసారి ఫ్యూచర్ రిటైల్ ఆర్థిక సమస్యల పరిష్కారానికి ఆసక్తితో ఉన్నట్లు ఫ్యూచర్ ఇండిపెండెంట్ డైరెక్టర్లను అమెజాన్ సంప్రదించింది. దీనికి ప్రతిగా ఈ నెల 29లోగా ఫ్యూచర్‌కు రూ.3500 కోట్ల నిధులు సమకూర్చాలని అమెజాన్‌ను ఫ్యూచర్ ఇండిపెండెంట్ డైరెక్టర్లు కోరారు.
శనివారం ప్రతిస్పందించిన అమెజాన్ 2020 జూన్ 30న ఖరారైన టర్మ్ షీట్‌కు అనుగుణంగా ఫ్యూచర్‌ను కొనుగోలు చేయడానికి రూ.7000 కోట్ల నిధులు సమకూర్చేందుకు సిద్ధం అని ఫ్యూచర్ రిటైల్ ప్రమోటర్లు, సమరా క్యాపిటల్‌కు శనివారం సమాధానం ఇచ్చిందని పీటీఐ ఓ వార్తాకథనం ప్రచురించింది. దీనిపై పీటీఐ వార్తా సంస్థ పంపిన ఈ-మెయిల్స్‌కు అమెజాన్ గానీ, ఫ్యూచర్ రిటైల్ గానీ ప్రతిస్పందించలేదు.
రిలయన్స్ రిటైల్‌లో విలీనంపై సింగపూర్ మధ్యవర్తిత్వ న్యాయస్థానంలో ఆర్బిట్రేషన్ కేసు, భారత్ కోర్టుల్లో కేసులపై తమ సహకారం ప్రభావం చూపబోదని ఫ్యూచర్‌కు రాసిన తాజా లేఖలో అమెజాన్ తెలిపింది. అన్ని రకాల సహాయ, సహకారాలు పూర్తిగా చట్టపరమైన నిబంధనలకు లోబడే జరుగుతాయని పేర్కొంది.