హైదరాబాద్, నవంబర్ 15: అమెరికాకు చెందిన మ్యాగ్నెటిక్ సెన్సింగ్ అండ్ పవర్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్(ఐసీ) సొల్యుషన్స్ సంస్థ అలెగ్రో మైక్రోసిస్టమ్స్..హైదరాబాద్లో రీసర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్(ఆర్అండ్డీ)ని ప్రారంభించింది. ఈ సందర్భంగా కంపెనీ సీఈవో వినీత్ నార్గోల్వాలా మాట్లాడుతూ..అంతర్జాతీయ స్థాయిలో పరిశోధన విభాగాన్ని మరింత బలోపేతం చేయడంలోభాగంగానే హైదరాబాద్లో నూతన ఆర్అండ్డీ సెంటర్ను ఏర్పాటు చేసినట్లు, తెలంగాణలో శక్తివంతమైన సాంకేతిక పర్యావరణ వ్యవస్థలో భాగమైనందుకు సంతోషంగా ఉన్నదని, అలాగే దేశీయ సెమీకండక్టర్ ఆశయాలకు తమవంతుగా సహాయ సహకారాలు అందించనున్నట్లు చెప్పారు. నగరంలో ప్రతిభ కలిగిన ఉద్యోగులకు కొదవ లేదని, అనుకూల ప్రభుత్వ పాలసీలతో ఇక్కడి విస్తరణకు అనుకూలంగా మారిందన్నారు. ప్రస్తుతం ఆర్అండ్డీ కోసం 100 మంది ప్రతిభ కలిగిన సిబ్బ ందిని నియమించుకున్నట్లు, సమీప భవిష్యత్తులో ఈ సంఖ్యను 500కి పెంచుకోనున్నట్లు ఆయన ప్రకటించారు. అంతర్జాతీయ ఆటోమొబైల్ దిగ్గజాలైన బీఎండబ్ల్యూ, అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహన తయా రీ సంస్థలకు అలెగ్రో మైక్రోసిస్టమ్స్ కీలక విడిభాగాలను సరఫరా చేస్తున్నది.