శనివారం 04 ఏప్రిల్ 2020
Business - Feb 12, 2020 , 23:58:11

అంతా బాగు

అంతా బాగు
  • ఈ ఏడాదిపై సహారా చీఫ్‌
  • సుబ్రతారాయ్‌ ఆశాభావం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12: ఈ ఏడాది తమ సమస్యలన్నీ పరిష్కారం కాగలవన్న ఆశాభావాన్ని సహారా గ్రూప్‌ చీఫ్‌ సుబ్రతారాయ్‌ వ్యక్తం చేశారు. సహారా సంస్థల్లో దాచుకున్న సొమ్ము భద్రంగా ఉంటుందన్న ఆయన వడ్డీతోసహా ఆ మొత్తాలను మదుపరులు తిరిగి అందుకుంటారని హామీ ఇచ్చారు. ఇప్పటిదాకా సెబీకి రూ.22 వేల కోట్లు డిపాజిట్‌ చేశామని, కానీ మదుపరులకు కేవలం రూ.100 కోట్లే అందిందని అన్నారు. మదుపరులకు వారి సొమ్ము వారికి అందేలా దేశవ్యాప్తంగా నాలుగుసార్లు 154 వార్తాపత్రికల్లో ప్రకటనలు ఇచ్చామని గుర్తుచేసిన ఆయన సెబీ తీరుపట్ల ఒకింత అసంతృప్తిని వెలిబుచ్చారు. గ్రూప్‌ 42వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా మదుపరులనుద్దేశించి సుబ్రతారాయ్‌ ఓ లేఖ రాశారు. 


ఇందులో గ్రూప్‌పట్ల మదుపరుల్లో ఉన్న విశ్వాసాన్ని పెంచేలా రాయ్‌ ప్రయత్నించారు. కాగా, రియల్‌ ఎస్టేట్‌, నగర అభివృద్ధి వ్యాపారాల కోసం రెండు భారీ విదేశీ సంస్థాగత మదుపరులను అందిపుచ్చుకున్నామని సుబ్రతా రాయ్‌ ఈ సందర్భంగా తెలిపారు. సహారా గ్రూప్‌నకు చెందిన ఎస్‌ఐఆర్‌ఈసీఎల్‌, ఎస్‌హెచ్‌ఐసీఎల్‌ నిబంధనలకు విరుద్ధంగా మదుపరుల నుంచి వేల కోట్ల రూపాయల డిపాజిట్లను సేకరించాయంటూ సెబీ ఆక్షేపించిన విషయం తెలిసిందే. ఈ కేసు సుప్రీం కోర్టుకు చేరగా, సెబీకి రూ.24 వేల కోట్లు ఇవ్వాలని అత్యున్నత న్యాయస్థానం చెప్పిన సంగతీ విదితమే.


logo