Alaska Air lines | బడ్జెట్ ఎయిర్ లైన్స్ సంస్థ అలాస్కా (Alaska Airlines) కీలక నిర్ణయం తీసుకున్నది. ప్రముఖ విమానాల తయారీ సంస్థ ‘బోయింగ్’ తయారు చేసిన ‘బోయింగ్ 737 మ్యాక్స్ 9’ విమానాలను పూర్తిగా నేలకు పరిమితం చేస్తున్నట్లు ప్రకటించింది. శుక్రవారం పోర్ట్‌ల్యాండ్‌లో టేకాఫ్ తీసుకున్న వెంటనే విండోతోపాటు విమానంలో కొంత భాగం ఊడిపోవడంతో ఓరేగాన్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో మొత్తం 65 బోయింగ్ విమానాలను తాత్కాలికంగా నేలకు పరిమితం చేసినట్లు అలాస్కా ఎయిర్ లైన్స్ సీఈఓ బెన్ మినిచుక్కి ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తిగా మెయింటెనెన్స్ తనిఖీలు పూర్తి చేసే వరకూ వాడొద్దని నిర్ణయించారు. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో ఓరెగాన్‌లో బోయింగ్ 737 మ్యాక్స్ 9 జెట్ విమానం అత్యవసర ల్యాండింగ్ అయినప్పుడు అందులో ఆరుగురు క్రూ సిబ్బంది, 171 మంది ప్రయాణికులు ఉన్నారు. ముందు జాగ్రత్తగా బోయింగ్ విమానాలను నేలకు పరిమితం చేస్తున్నట్లు బెన్ మినికుచ్చి తెలిపారు.
గత అక్టోబర్‌లోనే అలాస్కా ఎయిర్‌లైన్స్‌కు ‘బోయింగ్ 737 మ్యాక్స్9’ విమానాన్ని డెలివరీ చేసింది. ఈ ప్రమాదంపై స్పందించిన బోయింగ్ సంస్థ తన 737 మ్యాక్స్ విమానంపై తమ కస్టమర్లలో విశ్వాసం పునరుద్ధరించడంపై ద్రుష్టి పెట్టినట్లు తెలిపింది. అలాస్కా ఎయిర్ లైన్స్ మొత్తం బోయింగ్ విమానాలనే నడుపుతుండటం గమనార్హం.