Gold | న్యూఢిల్లీ, ఏప్రిల్ 26: రికార్డు స్థాయికి బంగారం ధరలు చేరుకోవడంతో ఆభరణాల విక్రయదారుల్లో టెన్షన్ నెలకొన్నది. లక్షకు చేరువలో పుత్తడి కదలాడుతుండటంతో కొనుగోలుదారులను ఆకట్టుకోవడానికి ఆభరణ విక్రయ సంస్థలు అన్ని విధాలుగా ప్రయత్నాలను ప్రారంభించాయి. ఈ నెల 30న అక్షయ తృతీయ ఉండటంతో రిటైల్ దిగ్గజాలు ప్రత్యేక ఆఫర్లను తెరపైకి తీసుకొచ్చాయి. వీటితో తనిష్క్, మలబార్ గోల్డ్, రిలయన్స్, క్యారట్‌లైన్, కల్యాణ్‌జ్యూవెల్లర్స్ వంటి దిగ్గజాలు ఉన్నాయి.
టాటా గ్రూపునకు చెందిన ఆభరణాల విక్రయ సంస్థ తనిష్క్..అక్షయ తృతీయ సందర్భంగా ఆభరణాలపై ప్రత్యేక ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ నెల 30 వరకు అందుబాటులో ఉండనున్న ఈ ఆఫర్ కింద గోల్డ్ లేదా డైమండ్ ఆభరణాల తయారీపై చార్జీలను 20 శాతం వరకు తగ్గింపు కల్పిస్తున్నది.
రిలయన్స్ జ్యూవెల్స్ కూడా ప్రత్యేక ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. బంగా రు ఆభరణాల తయారీపై 25 శాతం వరకు తగ్గింపు కల్పించిన సంస్థ..డైమండ్ జ్యూవెల్లరీపై 30 శాతం తగ్గింపునిచ్చింది. దీంతోపాటు పాత గోల్డ్‌పై 100 శాతం ఎక్సేంజ్ కూడా అందిస్తున్నది. ఈ ఆఫర్ వచ్చే నెల 5 వరకు అందుబాటులో ఉండనున్నది.
మలబార్ గోల్డ్ కూడా గోల్డ్, డైమండ్ల ఆభరణాల తయారీపై విధించే చార్జీలను 25 శాతం వరకు డిస్కౌంట్‌ను ఇస్తున్నది.
అక్షయ తృతీయ సందర్భంగా గోల్డ్ జ్యూవెల్లరీ తయారీపై విధించే చార్జీలను 50 శాతం వరకు కోత పెట్టింది. ఇందుకోసం అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. అలాగే మొత్తం కొనుగోలులో నాలుగోవంతు ముందస్తుగానే చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది.
కొనుగోలుదారులను ఆకట్టుకోవడానికి క్యారెట్‌లైన్ ప్రత్యేక ఆఫర్లను ప్రవేశపెట్టింది. రూ.15 వేల నుంచి రూ.30 వేల లోపు బంగారాన్ని కొనుగోలు చేసిన వారికి 10 గ్రాముల వెండి నాణేన్ని, రూ.30 వేల నుంచి రూ.60 వేల లోపు బంగారంపై అరగ్రాము బంగారం నాణేన్ని, రూ.60 వేల నుంచి రూ.90 వేల లోపు కొనుగోళ్లపై అరగ్రాము గోల్డ్ కాయిన్ అందిస్తున్నట్టు ప్రకటించింది.