Akasa Air | ఆకాశ ఎయిర్ త్వరలో మరికొన్ని దేశీయ, అంతర్జాతీయ రూట్లో విమానాలను ప్రారంభించనున్నది. ఈ మేరకు బోయింగ్ నుంచి విమానాలను త్వరగా తీసుకురావాలని ఆశియస్తున్నట్లుగా సీనియర్ ఎయిర్‌లైన్ అధికారి సోమవారం తెలిపారు. ఆకాసా ఎయిర్‌లైన్స్ 2022 ఆగస్టులో తొలిసారిగా కార్యకలాపాలు ప్రారంభించింది. ప్రస్తుతం ఆ కంపెనీకి 30 విమానాలు ఉన్నాయి. 24 దేశీయ, మరో ఆరు అంతర్జాతీయ గమ్యస్థానాలకు విమానాలను నడుపుతుంది. త్వరలోనే ఢిల్లీ నుంచి మరికొన్ని అంతర్జాతీయ విమానాలను ప్రారంభించనున్నట్లు ఆకాశ ఎయిర్ సహ వ్యవస్థాపకుడు, చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ ప్రవీణ్ అయ్యర్ పేర్కొన్నారు. ఎయిర్‌లైన్ ప్రస్తుతం ఢిల్లీ నుంచి ప్రతిరోజూ 24 విమానాలను నడుపుతోంది.
సింగపూర్, ఉజ్బెకిస్తాన్, ఇండోనేషియా, వియత్నాం, తాష్కెంట్తో సహా వివిధ విదేశీ గమ్యస్థానాలకు విమానాలను నడపాలని ఎయిర్‌లైన్ యోచిస్తుందని అయ్యర్ ఓ బ్రీఫింగ్లో చెప్పారు. ఆకాశ ఎయిర్ ప్రస్తుతం ఆరు అంతర్జాతీయ నగరాలకు విమానాలను నడుపుతోంది. ఇందులో దోహా (ఖతార్), జెడ్డా, రియాద్ (సౌదీ అరేబియా), అబుదాబి (యూఏఈ), కువైట్ సిటీ, ఫుకెట్ (థాయిలాండ్) ఉన్నాయి. ఎయిర్‌లైన్ మొత్తం 226 బోయింగ్ 737 మాక్స్ విమానాలను ఆర్డర్ చేసింది. అయితే, డెలివరీలో జాప్యం జరుగుతున్నది. బోయింగ్ ఉత్పత్తిని పెంచుతున్నందున కంపెనీకి వేగంగా విమానాలు వస్తాయని ఆశిస్తున్నట్లుగా అయ్యర్ తెలిపారు. అనుబంధ ఆదాయ వృద్ధిపై సంతోషంగా ఉన్నామని.. లోడ్ ఫ్యాక్టర్, విమాన ఛార్జీల పరంగా ప్రస్తుతం సమతుల్యత ఉందని ఆయన వివరించారు.