న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8: దేశీయ టెలికం దిగ్గజాల్లో ఒకటైన భారతీ ఎయిర్టెల్ నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. డిసెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ నికర లాభం ఏడాది ప్రాతిపదికన 2.8 శాతం తగ్గి రూ.830 కోట్లకు పరిమితమైనట్లు వెల్లడించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో రికార్డు స్థాయి రూ.854 కోట్ల లాభాన్ని గడించిన విషయం తెలిసిందే. 2020-21 మూడో త్రైమాసికంలో రూ.26,518 కోట్లుగా ఉన్న కంపెనీ ఆదాయం గత త్రైమాసికానికిగాను 12.6 శాతం పెరిగి రూ.29,867 కోట్లుగా నమోదైంది.
కంపెనీ కన్సాలిడేటెడ్ నికర అప్పు రూ.1.59 లక్షల కోట్లుగా ఉన్నది. ఏడాది క్రితం ఇది రూ.1.47 లక్షల కోట్లు
భారతీ ఎయిర్టెల్ ఇండియా ఆదాయం 10 శాతం పెరిగి రూ.19 వేల కోట్ల నుంచి రూ.20,913 కోట్లకు చేరుకున్నది.
మొబైల్ సేవల ద్వారా వచ్చే ఆదాయంలో 9 శాతం పెరిగి రూ.16,092 కోట్లుగా నమోదైంది.
ప్రస్తుతం సంస్థకు 16 దేశాల్లో 48.5 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. వీరిలో భారత్‌లో 35.5 కోట్ల మంది ఉన్నారు.
ఒక్కో వినియోగదారుడి నుంచి వచ్చే సరాసరి ఆదాయం 2.2 శాతం తగ్గి రూ.163కి పడిపోయింది. గతంలో ఇది రూ.166గా ఉన్నది.
దేశవ్యాప్తంగా 4జీ వినియోగదారులు ర్యాపిడ్ వేగంతో దూసుకుపోతున్నారు. ఏడాది క్రితం 16.56 కోట్లుగా ఉన్న 4జీ కస్టమర్లు గత త్రైమాసికానికిగాను 19.5 కోట్లకు చేరుకున్నారు.
ఒక్కో వినియోగదారుడి డాటా వినిమయం 11.7 శాతం పెరిగి 18.28 గిగాబైట్లకు చేరుకున్నది. అంతక్రితం ఇది 16.37 జీబీగా ఉన్నది.
గత త్రైమాసికంలో మూలధన వ్యయం కింద రూ.6 వేల కోట్ల నిధులు ఖర్చు చేసింది.
రూ.7,500 కోట్ల నిధుల సేకరణకు కంపెనీ బోర్డు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.
‘ఇటీవలి కాలంలో పెంచిన మొబైల్ టారిఫ్‌ల ప్రభావం కనపడుతున్నది. నాలుగో త్రైమాసికంలో ఈ ప్రభావం స్పష్టంగా
కనిపించనున్నది. ఎంటర్ప్రైజ్ హోమ్స్, ఆఫ్రికా వ్యాపారాలు బలమైన వృద్ధిని నమోదు చేసుకుంటున్నాయి.
కంపెనీ బ్యాలెన్స్ షీట్ మెరుగుపడింది. స్పెక్ట్రం బకాయిలు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాం’
– గోపాల్ విఠల్, భారతీ ఎయిర్టెల్ ఎండీ, సీఈవో(ఇండియా, దక్షిణాసియా)