Air India | టాటా సన్స్ ఆధీనంలోని ఎయిర్ ఇండియా (Air India) తన సేవల విస్తరణ దిశగా వడివడిగా అడుగులేస్తున్నది. ఇతర ఎయిర్ లైన్స్ నుంచి గట్టి పోటీ ఎదురవుతున్న నేపథ్యంలో పొదుపు చర్యలపైనా ఫోకస్ చేస్తూనే ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడానికి అడుగులేస్తున్నది. ఈ క్రమంలో ఎయిర్ఇండియా తన విమానాలన్నింటికీ అమెరికా కేంద్రంగా పని చేస్తున్న ఇంజిన్ల తయారీ సంస్థ సీఎఫ్ఎం ఇంటర్నేషనల్ (CFM International) తో అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్నది.
ఎయిర్ బస్, బోయింగ్ సంస్థల విమానాలకు సీఎఫ్ఎం లీఫ్ ఇంజిన్లు వినియోగించనున్నది. ఇందుకోసం 400 లీఫ్ ఇంజిన్ల కొనుగోలుకు ఎయిర్ ఇండియాతో ఒప్పందం కుదిరిందని సీఎఫ్ఎం ఇంటర్నేషనల్ గురువారం తెలిపింది. దీని ప్రకారం ఎయిర్ బస్ నుంచి కొనుగోలు చేసే 210 ‘ఏ320 నియో / ఏ 321 నియోస్`, 190 `బోయింగ్ 737 మ్యాక్స్ ఫ్యామిలీ’ విమానాల్లో సీఎఫ్ఎం లీఫ్ ఇంజిన్లు వినియోగించనున్నది మహారాజా. సీఎఫ్ఎం, ఎయిర్ ఇండియా మధ్య గత ఫిబ్రవరిలోనే ఒప్పందం కుదిరినా, ఇంజన్ల మరమ్మత్తు ప్యాకేజీపై ఏకాభిప్రాయం రాలేదు. దీంతో ఆ ఒప్పందంపై ప్రకటన చేయలేదు.
2002 నుంచి ఎయిర్ ఇండియాకు సీఎఫ్ఎం కస్టమర్‌గా ఉంది. ఎయిర్ బస్ ఏ320నియో విమానాలకు సీఎఫ్ఎం 56-5బీ ఇంజిన్లు వాడుతున్నప్పటి ఎయిర్ఇండియాకు సీఎఫ్ఎం కస్టమర్. 2017 నుంచి ఏ320 విమానాలకు తొలి లీఫ్-1ఏ ఇంజిన్ వినియోగిస్తున్నారు. సీఎఫ్ఎం ఇంజిన్ల వాడకంతో 15-20 శాతం ఇంధనం ఆదా కావడంతోపాటు కర్బన ఉద్గారాలు తగ్గుతాయి.
లీఫ్ ఇంజిన్లతో విమానాలు నడపడం వల్ల సేవలు మరింత విస్తరించవచ్చునని, వాటి మరమ్మతులు కూడా తేలికవుతాయని, శబ్ధ కాలుష్యం కూడా తగ్గుతుందని ఎయిర్ ఇండియా సీఈఓ కం ఎండీ క్యాంప్ బెల్ విల్సన్ చెప్పారు. తమపై ఎయిర్ ఇండియా నమ్మకాన్ని పునరుద్ధరించడం తమ చరిత్రలో ఒక మైలురాయి అని సీఎఫ్ఎం ఇంటర్నేషనల్ సీఈఓ గేల్ మెహస్ట్ తెలిపారు.