న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4: ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ప్రత్యేక ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ‘నమస్తే వరల్డ్’ పేరుతో తీసుకొచ్చిన ఈ ఆఫర్ల కింద విమాన టికెట్‌పై 20 శాతం తగ్గింపు ధరతో విక్రయిస్తున్నది. దీంతో దేశీయంగా ప్రారంభ విమాన టికెట్ ధర రూ.1,499గా నిర్ణయించిన సంస్థ..అంతర్జాతీయ రూట్లో రూ.5,033కి విక్రయించనున్నది.
ఉత్తర అమెరికా, యూరప్, బ్రిటన్, ఆస్ట్రేలియా దేశాల మధ్య నడిచే విమాన సర్వీసులకు ఈ ఆఫర్ వర్తించనున్నది. గురువారం అర్దరాత్రి లోపు బుకింగ్ చేసుకోనున్న ప్రయాణికులు ఈ నెల 11 నుంచి డిసెంబర్ 31లోగా ఎప్పుడైనా ప్రయాణించవచ్చునని తెలిపింది. బుకింగ్ చేసుకున్న తేదీని మార్చుకునే అవకాశం కూడా ప్రయాణికులకు కల్పించింది. airindia.com, కంపెనీ మొబైల్ యాప్ ద్వారా బుకింగ్ చేసుకున్న వారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తించనున్నది. అలాగే ఎస్బీఐ క్రెడిట్ కార్డుతో బుకింగ్ చేసుకున్నవారికి రూ.10 వేల వరకు రాయితీ లభించనున్నది.