Nagarjuna Sagar | నల్లగొండ: నీళ్ల విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులకు ద్రోహం చేస్తుందని దేవరకొండ మాజీ శాసన సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పీఏపల్లి మండలం గణపురం స్టేజ్ సమీపంలోని ఏఎంఆర్పీ మెయిన్ కెనాల్ డిస్ట్రిబ్యూటర్ మెయిన్ గేట్ల వద్ద శుక్రవారం నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు. సుమారు 25 వేల క్యూసెక్కుల నీటిని పోతిరెడ్డిపాడు నుంచి తరలిస్తున్నప్పుడు నాగార్జున సాగర్‌కు నీరు రాకుండా అడ్డుకోవడం ఏమిటని ప్రశ్నించారు. నాగార్జున సాగర్ నిండేంత వరకు పోతిరెడ్డిపాడు ద్వారా నీటిని తరలించకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎవరి ఆదేశాలతో నీటిని తరలిస్తున్నారో ప్రభుత్వం స్పష్టం చేయాలని కోరారు. నాగార్జున సాగర్‌లో నీరు ఉన్నప్పటికీ రైతులకు సాగునీరు అందించేందుకు జిల్లా మంత్రి, స్థానిక ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేసీఆర్ హయాంలో నాగార్జున సాగర్ ఎడమ కాలువ కింద రైతులకు సమృద్ధిగా సాగునీరు అందించామని గుర్తుచేశారు. ప్రభుత్వానికి రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే సాగునీరు అందించాలని అన్నారు. ఈ ప్రాంత రైతులు ప్రధానంగా భూగర్భ జలాలపైనే ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు. చెరువులు, కుంటలు ఎండిపోవడంతో భూగర్భ జలాలు పడిపోతున్నాయి. ప్రజలు, పశువులకు తాగునీటి సమస్య ఎదురవుతుందని రవీంద్ర కుమార్ ఆదేవన వ్యక్తం చేశారు. నల్లగొండ పట్టణానికి తాగునీటిని తరలించడంతో పాటు గుడిపల్లి, పీఏ పల్లి మండలాల్లోని చెరువులు, కుంటలను కూడా నింపాలని కోరారు.
చంద్రబాబు నాయుడు ప్రయోజనాల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టును నిర్లక్ష్యం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణ ప్రయోజనాలను కాపాడాల్సిన ప్రభుత్వం ఇతర రాష్ట్రాల ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇస్తోందని విమర్శించారు. స్థానిక ఎమ్మెల్యేకు నల్లమట్టి మీద ఉన్న ప్రేమ రైతులపై లేదని విమర్శించారు. రైతుల సాగు, ప్రజల తాగునీటి అవసరాలపై ఎమ్మెల్యే స్పందించకపోవడం బాధాకరం అని దుయ్యబట్టారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కేతావత్ బిల్యా నాయక్, మండల అధ్యక్షులు వెల్లుగురి వల్లపు రెడ్డి, సీనియర్ నాయకులు కటికనేని మాధవ రావు, తోటకూరి పరమేశ్, సుధాకర్ గౌడ్, సర్పంచులు కూన్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి, రైనబోయిన శ్రీను, నగేశ్, రమావత్ కిషన్, అర్వపల్లి నర్సింహ, బొడ్డుపల్లి మహేందర్, దీపావత్ నరేందర్, ఎర్ర యాదగిరి, రైతులు, ప్రజలు పాల్గొన్నారు.