Air India | ఎయిర్ ఇండియా విమాన ప్రయాణికులకు సెలెక్టెడ్ రూట్లలో ఆఫర్లు అందుబాటులోకి తెచ్చింది. ఇండియా నుంచి సింగపూర్, బ్యాంకాక్ రూట్లలో ప్రయాణించే వారికి లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ ప్రకటించింది. ఎకానమీ, బిజినెస్ క్లాస్ల్లో ప్రయాణిస్తున్న వారికి వచ్చే ఏడాది మార్చి వరకూ ఈ ప్రమోషనల్ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. ఈ ఆఫర్ కింద టికెట్ ధరల్లో రాయితీ ఉంటుంది.
భారత్-సింగపూర్ రూట్లలో ఎకానమీ క్లాస్ టికెట్ ధరలు రూ.13,330 నుంచి, ఇండియా-బ్యాంకాక్ రూట్లో రూ.17,045 నుంచి ప్రారంభం అవుతాయి. బిజినెస్ క్లాస్ టికెట్ ధర భారత్-సింగపూర్ రూట్ లో రూ.70,290, ఇండియా-బ్యాంకాక్ రూట్ లో రూ.49,120 నుంచి ప్రారంభం అవుతాయి.
సింగపూర్, థాయిలాండ్ నుంచి టికెట్ బుక్ చేసుకునే ప్రయాణికులకూ ఈ స్పెషల్ టికెట్ ధరలు లభిస్తాయి. సింగపూర్-ఇండియా ఎకానమీ క్లాస్ 279 డాలర్లు, బ్యాంకాక్-ఇండియా రూట్లో టీహెచ్బీ 9700, బిజినెస్ క్లాస్ టికెట్ ధర సింగపూర్-భారత్ రూట్లో 1579 డాలర్లు, బ్యాంకాక్ – ఇండియా రూట్ లో 25,960 టీహెచ్బీ చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఆఫర్ 96 గంటల పాటు అమల్లో ఉంటుంది.
ఈ నెల 18 అర్థరాత్రి 00:01 గంటల నుంచి 21 అర్థరాత్రి 23:59 గంటల వరకూ ఉంటుంది. 2024 మార్చి నెలాఖరు వరకూ ఈ ప్రమోషన్ ప్లాన్ విమాన ప్రయాణికులు ఉపయోగించుకోవచ్చు. ప్రయాణికులు బయలుదేరే నగరం, వెళ్లే సిటీని బట్టి టికెట్ ధరల్లో తేడాలో ఉంటాయని ఎయిర్ ఇండియా తెలిపింది. ఎయిర్ ఇండియా అధికారిక వెబ్ సైట్, ఐఓఎస్, ఆండ్రాయిడ్ మొబైల్ యాప్స్, ఆథరైజ్డ్ ట్రావెల్ ఏజంట్ల ద్వారా టికెట్ బుక్ చేసుకోవచ్చు.