హైదరాబాద్, సెప్టెంబర్ 10: ఎయిర్ ఇండియా అనుబంధ సంస్థ ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్..తాజాగా ‘ఫ్లాష్ సేల్’ పేరుతో ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. ఈ ఆఫర్ కింద ప్రారంభ విమాన టికెట్ ధరను రూ.932గా నిర్ణయించింది. ఈ నెల 16 వరకు బుకింగ్ చేసుకోనున్న ప్రయాణికులు వచ్చే ఏడాది మార్చి 31 వరకు ప్రయాణించవచ్చునని సంస్థ వెల్లడించింది. కంపెనీ వెబ్సైట్, మొబైల్ యాప్ ద్వారా బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. కంపెనీ వెబ్సైట్ ద్వారా బుకింగ్ చేసుకున్న ప్రయాణికులకు జీరో-చెక్-ఇన్ బ్యాగేజీ సదుపాయం కూడా లభించనున్నది. అలాగే విద్యార్థులకు, సీనియర్ సిటిజన్లకు, ఎస్ఎంఈలకు, డాక్టర్లు, నర్స్‌లకు, భద్రతదళాలకు ప్రత్యేక డిస్కౌంట్‌ను కల్పిస్తున్నది. ఇదిలా ఉంటే వచ్చే ఏడాది నుంచి వైట్-టెయిల్ విమానాల్లో బిజినెస్ క్లాస్ సీట్లను ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ తీసివేయనుంది.
మళ్లీ 25 వేల పైకి నిఫ్టీ
ముంబై, సెప్టెంబర్ 10: వరుసగా రెండోరోజు స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. అమెరికా మార్కెట్లు తిరిగి కోలుకోవడం, ఎఫ్ఐఐలు నిధులు కుమ్మరించడంతో సూచీలు కదంతొక్కాయి. ఒక దశలో 600 పాయింట్లకు పైగా లాభపడి 82 వేల పాయింట్లను అధిగమించిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు 361.75 పాయింట్లు ఎగబాకి 81,921.29 వద్ద స్థిరపడింది. మరో సూచీ నిఫ్టీ ఏకంగా 25 వేల పాయింట్ల మైలురాయిని మళ్లీ అధిగమించి 104.70 పాయింట్లు అందుకొని 25,041. 10 వద్ద ముగిసింది. నష్టాల్లో ప్రారంభమైన సూచీలకు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలు లాభాల జోరుకు దోహదం చేశాయి. త్వరలో విడుదలకానున్న అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు, ఫెడ్ నిర్ణయంపై మదుపరులు దృష్టి సారించడం దేశీయ సూచీలకు కలిసొచ్చిందని జియోజిట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. భారతీ ఎయిర్టెల్ 2.29 శాతం పెరిగి టాప్ గెయినర్‌గా నిలిచింది.