Hyundai SUVs | హ్యుండాయ్ మోటార్స్.. దేశీయ కార్ల మార్కెట్లో రెండోస్థానంలో కొనసాగుతున్నది. అయితే, ఎస్యూవీ కార్ల సేల్స్‌లో సరికొత్త రికార్డు నెలకొల్పింది. 2021తో పోలిస్తే తొమ్మిది శాతం సేల్స్ పెంచుకున్నది. 2021లో 5,05,033 కార్లు అమ్ముడైతే, 2022లో 5,52,500 కార్ల సేల్స్ జరిగాయి. హ్యుండాయ్ మోటార్స్ సేల్స్‌లోనే ఇది గరిష్టం. 2018 కార్ల సేల్స్‌లో హ్యుండాయ్ ఎస్యూవీ కార్లు 22.4 శాతం. 2019లో 25.6 శాతానికి, కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని చుట్టుముట్టిన వేళ 2020లో 29 శాతానికి దూసుకెళ్లింది. 2021లో 38.1 శాతమైతే, గతేడాది 41.8 శాతానికి పెంచుకున్నది హ్యుండాయ్ మోటార్స్.
కొవిడ్ మహమ్మారి తర్వాత కస్టమర్లు పెద్ద కార్లు, న్యూ డిజైన్ టెక్నాలజీ, కనెక్టివిటీ కార్ల పట్ల క్రేజీ పెంచుకున్నారని హ్యుండాయ్ మోటార్స్ సేల్స్, మార్కెటింగ్ అండ్ సర్వీస్ విభాగం డైరెక్టర్ తరుణ్ గార్గ్ చెప్పారు. హ్యుండాయ్ చరిత్రలో 2022లో అత్యధిక ఎస్యూవీ కార్లు విక్రయించాం అని తెలిపారు. `అంతకుముందు 2018లో అత్యధికం. 2022లో దేశీయ కార్ల మార్కెట్లో ఎస్‌యూవీల వాటా 53.3 శాతంలో హ్యుండాయ్ ఎస్‌యూవీలు 41.8 శాతం. మా ఎస్‌యూవీల వ్యూహం చాలా బాగా పని చేసింది` అని తరుణ్ గార్గ్ చెప్పారు. కస్టమర్లు రూ.10 లక్షల పై చిలుకు విలువ గల ప్రీమియం కార్లకు ప్రాధాన్యం ఇస్తున్నారు. హ్యుండాయ్ కార్ల సేల్స్‌లో ఇది 45 శాతం.
మున్ముందు ఎస్యూవీ కార్లకు గిరాకీ పెరుతుందని హ్యుండాయ్ మోటార్స్ భావిస్తున్నది. అన్ని సెగ్మెంట్లతో పోలిస్తే ఎక్కువ ధర గల కార్లు 2021లో 17 శాతం అమ్ముడైతే, 2022లో 20 శాతానికి పెంచుకున్నది. ఎస్యూవీ కార్లలో డీజిల్ వేరియంట్లకూ గిరాకీ బాగానే ఉంది. డీజిల్ వేరియంట్ టస్క్ 72 శాతం, అల్కాజర్ 75 శాతం, క్రెటా 54 శాతం అమ్ముడయ్యాయని తరుణ్ గార్గ్ తెలిపారు. 2021తో పోలిస్తే అల్కాజర్ సిగ్నేచర్ మోడల్ కార్ల సేల్స్ 35 నుంచి 44 శాతానికి పెరిగాయి. టస్కన్ 91 నుంచి 93, క్రెటా 19 నుంచి 20, నియోస్ ఐదు నుంచి ఆరు శాతానికి సేల్స్ పెంచుకున్నది.