న్యూఢిల్లీ, డిసెంబర్ 18: జాబ్ మార్కెట్‌ను కృత్రిమ మేధస్సు (ఏఐ) ఏ స్థాయిలో కలవరపెడుతున్నదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికార వర్గాల నుంచి సైతం ఇదే హెచ్చరికలు వస్తుండటం మరింత భయాందోళనకు గురిచేస్తున్నది. దేశీయ వ్యాపార, పారిశ్రామిక సంఘం ఫిక్కీ ఏర్పాటు చేసిన ఏఐ ఇండియా సదస్సులో గురువారం కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఎస్ కృష్ణన్ మాట్లాడుతూ.. ఏఐతో వైట్-కాలర్ ఉద్యోగాలకు అత్యంత ఎక్కువగా ముప్పు ఉన్నదని, నైపుణ్యం పెంచుకోవాలని, లేకపోతే అంతేసంగతి అంటూ హెచ్చరించారు. కోటి ఆశలతో మరికొద్ది రోజుల్లో కొత్త ఏడాదిలోకి అడుగు పెట్టబోతున్న సమయంలో ఈ వ్యాఖ్యలు ఉద్యోగులకు గుబులు పుట్టించేలాగే ఉన్నాయి మరి. టెక్నాలజీ సంబంధిత ఉద్యోగులు చాలా అప్రమత్తంగా ఉండాలని, ఆటోమేషన్ ప్రభావం వీరిపై ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు.
నిజానికి ఏఐని అందిపుచ్చుకోవడానికి కంపెనీలు ఎంతో ఉత్సుకతతో ఉన్నాయని, కానీ తమకు మాత్రం ఆందోళనగా ఉందని కృష్ణన్ చెప్పారు. ఆ మేరకు అంచనాలకు తగ్గట్టుగా ఉద్యోగుల్లో నైపుణ్యం, ప్రతిభను పెంపొందించడం ఎలా? అన్నదే తమ భయాలకు కారణమని తెలిపారు. ఇదిలావుంటే ఇప్పటికే టెక్ దిగ్గజ సంస్థలు పెద్ద ఎత్తున ఉద్యోగుల తొలగింపునకు దిగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఐటీ రంగంలో అధికంగా కనిపిస్తున్నాయి. దీంతో నూతన మెలకువలను, సాంకేతికతను ఒడిసి పట్టుకోవాలని మార్కెట్ నిపుణులూ సలహా ఇస్తున్నారిప్పుడు.
ప్రొఫెషనల్, అడ్మినిస్ట్రేటివ్ లేదా మేనేజ్మెంట్ హోదాల్లో ఉన్నవారికి ఏఐ సెగ గట్టిగా తగలవచ్చన్న అంచనాలున్నాయి. అలాగే డాటా ఎంట్రీ, కస్టమర్ సర్వీస్, జూనియర్ ప్రోగ్రామింగ్ తదితర వైట్-కాలర్ ఉద్యోగులకూ ఏఐ రాక ఇబ్బందికరంగానే పరిణమిస్తున్నది. తక్కువ ఖర్చుతో ఎక్కువ పని, ఉత్పాదకతకు వీలుండటంతో దాదాపు అన్ని రంగాల్లోని కంపెనీలు ఏఐ టెక్నాలజీపట్ల అమితాసక్తిని ప్రదర్శిస్తున్నాయి. చాలా దేశాల్లో ఇప్పటికే ఈ మార్పు కనిపిస్తుండటం గమనార్హం.