న్యూఢిల్లీ, జూన్ 30 : దేశీయ ఐటీ సంస్థలు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. గతంలో ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన సంస్థలకు ఏఐ బ్రేక్‌లు వేసింది. గడిచిన మూడేండ్లుగా ఐటీ కంపెనీల ఆదాయంలో 2-3 శాతం వృద్ధిని నమోదు చేసుకున్న సంస్థలు..ఏఐ రాకతో వీటి ఆదాయం భారీగా పడిపోనున్నదని జేపీ మోర్గాన్ అంచనావేసింది. వీటికి తోడు అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు, పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు వీటి ఆదాయంపై నీళ్లు చల్లుతున్నదని తెలిపింది. వచ్చే రెండేండ్లకాలంలో ఆయా సంస్థల ఆదాయం 2 శాతం కంటే తక్కువగా నమోదుకావచ్చునని జేపీ మోర్గాన్ అంచనావేస్తున్నది.
ఏఐలో నెలకొన్న అంతరాయాలకు తోడు భౌగోళిక రాజకీయ అనిశ్చితి పరిస్థితుల కారణంగా డిమాండ్‌పై ప్రతికూల ప్రభావం చూపనున్నదని, అలాగే దేశీయ సమాచార సాంకేతిక రంగంలో సుదీర్ఘకాలం పాటు బలహీనమైన వృద్ధిని ఎదుర్కొనే అవకాశాలున్నాయని తెలిపింది. సాంకేతిక, ప్రస్తుతం నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల కారణంగా ఐటీ రంగం ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కోక తప్పదని బ్రోకరేజ్ వర్గాలు హెచ్చరించాయి. సంస్థలు తమ వ్యయ ప్రాధాన్యతలను పున:సమీక్షించుకోవాల్సిన అవసరం ఉన్నదని, అలాగే వృద్ధిలో గణనీయమైన పురోగతి సాధించాలని సూచించింది.
దేశీయ, అంతర్జాతీయ ఐటీ దిగ్గజ సంస్థలు తమ గైడెన్స్‌లో మెరుగైన పనితీరు కనబరిచే అవకాశాలు లేవని పేర్కొంటున్నాయి. ప్రముఖ అంతర్జాతీయ ఐటీ దిగ్గజ సంస్థల్లో ఒకటైనా యాక్సెంచర్ సమీప భవిష్యత్తులో ఆదాయంలో వృద్ధి సింగిల్ డిజిట్‌కు పరిమితంకానున్నదని పేర్కొంది. సాంకేతిక, వ్యాపారానికి సబంధించి ప్రతికూలతల కారణంగా ఐటీ రంగం అనిశ్చిత పరిస్థితులను ఎదుర్కోక తప్పదని హెచ్చరించింది. సంస్థలు తమ వ్యయ ప్రాధాన్యతలను పున:సమీక్షించుకుంటునే ఉండటం, వృద్ధిలో గణనీయమైన పునరుద్దరణ ఇంకా దూరంగానే ఉందని హెచ్చరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో గరిష్ఠ స్థాయిలో ఆదాయం నమోదైనప్పటికీ మిగతా త్రైమాసికాల్లో మాత్రం తక్కువ స్థాయికి పడిపోనున్నదని పేర్కొంది.