Microsoft on AI | కృత్రిమ మేధ వినియోగంపై గ్లోబల్ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ అధ్యక్షుడు బ్రాడ్ స్మిత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం టెక్నాలజీ రంగంలో శక్తిమంతమైన టూల్ ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’లో సాధిస్తున్న పురోగతిని నిరోధించడం అసాధ్యం అని తేల్చేశారు. కానీ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ని దుర్వినియోగం చేయకుండా అడ్డుకోవడానికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నిబంధనలు రూపొందించడమే ఏకైక మార్గం అని పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. ఏఐ దుర్వినియోగం చేయకుండా అవసరమైన నిబంధనలు, విధానాల రూపకల్పన సాధ్యమైనంత వేగంగా జరుగాలన్నారు.
భారతదేశంతోపాటు ప్రపంచ దేశాలన్నింటికీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంతో మేలు చేస్తుందని, అయితే, బాధ్యతాయుతంగా వాడుకోవాలని బ్రాడ్ స్మిత్ చెప్పారు. రోజువారీ కార్యకలాపాలపై కృత్రిమ మేధ సానుకూలప్రభావం చూపుతుందన్నారు. ఇటీవల భారత్ తెచ్చిన ‘సమాచార రక్షణ చట్టం’ చలా బాగుందని, దేశీయంగా కల్పిస్తున్న డిజిటల్ మౌలిక వసతులకు బాగున్నాయన్నారు. భారతదేశంలో మరిన్ని పెట్టుబడులు పెట్టడానికి తమ సంస్థ కట్టుబడి ఉందన్నారు.