న్యూఢిల్లీ, జూన్ 2: వ్యవసాయ భూముల క్రయవిక్రయాల వేదిక ఎస్ఫార్మ్స్ఇండియాతో ఐఐఎం అహ్మదాబాద్ జట్టు కట్టింది. ఇరు సంస్థలు కలిసి దేశవ్యాప్తంగా వ్యవసాయ భూముల ధరల వివరాలకు సంబంధించి నాణ్యమైన గణాంకాల నమోదు కోసం ఓ అగ్రీ ల్యాండ్ ప్రైస్ ఇండెక్స్‌ను గురువారం ప్రారంభించాయి. ఐఐఎంఏ-ఎస్‌ఫార్మ్స్ఇండియా అగ్రీ ల్యాండ్ ప్రైస్ ఇండెక్స్ (ఐఎస్ఏఎల్పీఐ) పేరుతో పరిచయమైన ఈ వ్యవసాయ భూముల ధరల సూచిక.. ప్రస్తుతం తెలంగాణసహా 6 రాష్ర్టాల్లో అందుబాటులో ఉన్నది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరప్రదేశ్‌ల్లో ఐఎస్ఏఎల్పీఐ సేవలు లభిస్తాయని ఆయా సంస్థలు ఈ సందర్భంగా తెలియజేశాయి. ‘ఇదో పైలట్ దశ. ఇప్పటికైతే 6 రాష్ర్టాల్లోని భూముల వివరాలున్నాయి. సెప్టెంబర్‌కల్లా మరింతగా విస్తరిస్తాం’ అని ఐఐఎంఏ రియల్ ఎస్టేట్ ఫైనాన్స్ అసోసియేట్ ప్రొఫెసర్ ప్రశాంత్ దాస్ తెలిపారు. ‘మా ఇండెక్స్‌తో విధానకర్తలు, స్థానిక ప్రభుత్వాలు, పర్యావరణవేత్తలు, మదుపరులు, రియల్ ఎస్టేట్ డెవలపర్లు, ఫైనాన్షియర్లకు ప్రయోజనం కలుగుతుంది’ అని ఎస్‌ఫార్మ్స్ఇండియా సీఈవో కామేశ్ ముప్పరాజు ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.