Vehicle Sales 2022 | ఫెస్టివ్ సీజన్‌తో గతేడాది అక్టోబర్, నవంబర్ నెలల్లో వెహికల్స్ విక్రయాలు సజావుగా సాగాయి. కానీ, ఫెస్టివ్ సీజన్ ముగియడంతో గత నెలలో రిటైల్ ఆటోమొబైల్ సేల్స్ ఐదు శాతం తగ్గాయి. ప్రత్యేకించి టూ వీలర్స్ విక్రయాలు 11 శాతం పడిపోయాయని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఫాడా – FADA ) పేర్కొంది. ద్రవ్యోల్బణం ప్రభావంతో ధరలు పెరగడం, ఓనర్షిప్ కాస్ట్ ఎక్కువ కావడంతో గ్రామాల్లో వెహికల్స్ కొనుగోళ్లు పుంజుకోలేదు. మరోవైపు ఎలక్ట్రిక్ వెహికల్స్ ఊపందుకుంటున్నా, ఐసీఈ టూ వీలర్స్ సేల్స్ ఇంకా దూసుకెళ్లడం లేదని ఫాడా అధ్యక్షుడు మనీష్ రాజ్ సింఘానియా పేర్కొన్నారు.
అక్టోబర్‌లో పండుగల సీజన్లో 48 శాతం విక్రయాలు పెరిగితే, గత నవంబర్‌లో పెండ్లిండ్ల వల్ల 26 శాతం పుంజుకున్నాయి. టూ వీలర్స్ సెగ్మెంట్ సేల్స్ పెరిగాయి. టూ వీలర్స్ 42 శాతం, త్రీ వీలర్స్ 8 శాతం, ప్రైవేట్ వెహికల్స్ ఐదు శాతం, ట్రాక్టర్ అండ్ కమర్షియల్ వెహికల్స్ 11 శాతం పుంజుకున్నాయి. అయినా కొవిడ్-19 ముందు నాటి స్థాయిని వెహికల్స్ సేల్స్ అందుకోలేదు.
2019 డిసెంబర్‌తో పోలిస్తే గత నెలలో రిటైల్ ఆటోమొబైల్ సేల్స్ 12 శాతం తక్కువే. గత నెలలో టూ వీలర్స్ 21 శాతం సేల్స్ పతనం అయ్యాయి. కానీ, త్రీ వీలర్స్ నాలుగు శాతం, కార్లు 21 శాతం, ట్రాక్టర్లు 27 శాతం, కమర్షియల్ వెహికల్స్ 9 శాతం పెరిగాయి.
2021తో పోలిస్తే గతేడాది మొత్తం వెహికల్స్ సేల్స్ 15 శాతం, 2020తో పోలిస్తే 17 శాతం పెరిగాయి. కానీ, కొవిడ్-19కి ముందు.. 2019తో పోలిస్తే 10 శాతం తక్కువే. అయితే, 2022లో కార్ల విక్రయాలు అత్యధికంగా 3.43 మిలియన్ల యూనిట్లు విక్రయించాయి కార్ల తయారీ సంస్థలు. కరోనా వేళ పూర్తిగా పడిపోయిన త్రీ వీలర్స్ సేల్స్.. 2019తో పోలిస్తే 2022లో స్వల్పంగా పుంజుకున్నాయి. ఇందులో ఎలక్ట్రిక్ రిక్షాల సేల్స్ త్రిపుల్ డిజిట్ గ్రోత్ నమోదైంది. ఎలక్ట్రిక్ వెహికల్స్ మార్కెట్ వాటా 50 శాతం దాటింది.
కార్ల సేల్స్ ఏడాది పొడవునా నిరంతరం గ్రోత్ నమోదవుతూ వచ్చింది. ఇక కమర్షియల్ వెహికల్స్ విక్రయాలు.. దాదాపు ప్రీ-కొవిడ్ నాటి స్థాయికి చేరుకున్నాయి. నిర్మాణ పనులు, పరికరాలకు గిరాకీ పెరగడంతో లైట్ కమర్షియల్ వెహికల్స్, హై కమర్షియల్ వెహికల్స్, బస్సులకు డిమాండ్ ఎక్కువైంది. కార్లతోపాటు 2022లో ట్రాక్టర్లు లైఫ్‌టైం గరిష్ట స్థాయి విక్రయాలు జరిగాయి. 2019,2020, 2021 కంటే ఎక్కువగా 7.94 లక్షల ట్రాక్టర్ల సేల్స్ జరిగాయి.