Future To Supreme Court | ఫ్యూచర్స్ రిటైల్ నెట్వర్క్ తాజాగా సుప్రీంకోర్టు తలుపు తట్టింది. రిలయన్స్ రిటైల్‌లో ఫ్యూచర్ రిటైల్ విలీనానికి వ్యతిరేకంగా, అమెజాన్‌కు అనుకూలంగా ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు చెప్పడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఫ్యూచర్ ఫౌండర్ కిశోర్ బియానీ, సంస్థ ఆస్తులను జప్తు చేయకుండా ఆదేశించాలని కోరుతూ గురువారం పిటిషన్ దాఖలు చేసింది. ఫ్యూచర్ కూపన్స్, ఫ్యూచర్ రిటైల్, కిశోర్ బియానీ ఆస్తులను జప్తు చేయాలన్న ఢిల్లీ హైకోర్టు సింగిల్ జడ్జి ఆదేశాలను నిలిపేయాలని దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఫ్యూచర్ గ్రూప్ అభ్యర్థించింది.
రిలయన్స్‌కు రూ.24,713 కోట్ల విలువైన ఫ్యూచర్ రిటైల్ గ్రూప్ విక్రయానికి వ్యతిరేకంగా సింగపూర్ అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కోర్టు ఇచ్చిన అత్యవసర ఆదేశం ఆమోదయోగ్యమేనని గత శుక్రవారం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అంతే కాదు.. ఫ్యూచర్ గ్రూప్ ఆస్తులను జప్తు చేయాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను కూడా అమలు చేయాలని కూడా దేశ అత్యున్నత న్యాయస్థానం వెల్లడించింది.
ఇలా ఆస్తుల జప్తుకు ఢిల్లీ హైకోర్టు ఆదేశం..
ఫ్యూచర్ గ్రూప్ ఉద్దేశపూర్వకంగా సింగపూర్ ట్రిబ్యునల్ ఆదేశాలను ఉల్లంఘిస్తున్నదని గత మార్చిలో ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. కిశోర్ బియానీ, ఫ్యూచర్ గ్రూప్ రూ.20 లక్షలు ఫైన్ చెల్లించాలని తీర్పు చెప్పింది. అది ప్రధానమంత్రి సహాయ నిధికి చెల్లించాలని ఆదేశించింది.