న్యూఢిల్లీ, ఫిబ్రవరి 29: సువెన్ ఫార్మాస్యూటికల్స్..కాంట్రాక్ట్ డెవలప్మెంట్, మాన్యుఫాక్చరింగ్ కంపెనీ (సీడీఎంవో) ప్లాట్‌ఫామ్ కొహెన్స్ లైఫ్ సైన్సెస్‌తో విలీనం కానుంది. సువెన్ ఈ మేరకు గురువారం సమాచారం అందించింది. విలీన స్కీమ్‌లో భాగంగా కొహెన్స్ షేర్హోల్డర్లకు ప్రతీ 295 షేర్లకు 11 సువెన్ షేర్లను జారీచేస్తారు.
జారీకాబోయే సువెన్ ఫార్మా కొత్త షేర్లు ఎన్ఎస్ఈ, బీఎస్ఈల్లో ట్రేడవుతాయని కంపెనీ తెలిపింది. ఈ లావాదేవీ షేర్హోల్డర్లు, సంబంధిత రెగ్యులేటరీ అనుమతులకు లోబడి వచ్చే 12-15 నెలల్లో పూర్తవుతుంది. సువెన్ను ప్రమోట్ చేసిన జాస్తి కుటుంబం కంపెనీల్లో తమ 50.1 శాతం వాటాను 2022 డిసెంబర్లో గ్లోబల్ పీఈ ఫండ్ అడ్వంట్ ఇంటర్నేషనల్‌కు విక్రయించారు.