న్యూఢిల్లీ, జూలై 21: భారత్ జీడీపీ వృద్ధి రేటు అంచనాలకు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ) కోత పెట్టింది. కొవిడ్ ప్రభావానికి తోడు రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో ద్రవ్యోల్బణం పెరిగిపోయినందున, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ వృద్ధి 7.2 శాతానికి పరిమితమవుతుందని ఏడీబీ అంచనా వేసింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో 7.5 శాతంగా ఉంటుందని ఏడీబీ ప్రకటించింది. అలాగే 2022 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటు అంచనాల్ని సైతం 8.9 శాతం నుంచి 8.7 శాతానికి తగ్గించింది. భారత్‌కు ఒమిక్రాన్ కొవిడ్ వేరియంట్ దెబ్బ తగిలిందని, ఉక్రెయిన్‌లో యుద్ధం ప్రభావం ఆర్థిక వ్యవస్థపై పడిందని, ఈ అంశాల కారణంగా వృద్ధి రేటు అంచనాల్ని 7.5 శాతం నుంచి 7.2 శాతానికి తగ్గిస్తున్నట్లు ఏడీబీ గురువారం విడుదల చేసిన ఆసియన్ డెవలప్మెంట్ అవుట్‌లుక్‌లో పేర్కొంది. ప్రస్తుతం వినియోగ విశ్వాసం మెరుగుపడుతున్నప్పటికీ, అధిక ద్రవ్యోల్బణం వినియోగదారుల కొనుగోలు శక్తిని హరించివేస్తుందని డెవలప్మెంట్ బ్యాంక్ వివరించింది.
అధిక ద్రవ్యోల్బణంతో ఏర్పడే దుష్ప్రభావాన్ని తగ్గించేందుకు ఉచిత ఆహార పంపిణీ పథకాన్ని కొనసాగించాలని భారత ప్రభుత్వానికి ఏడీబీ సూచించింది. ఎక్సయిజు సుంకాల్ని తగ్గింపు, ఎరువులు, గ్యాస్ సబ్సిడీలకు కేటాయింపులు వంటివి అవసరమని తెలిపింది. రిజర్వ్‌బ్యాంక్ పాలసీ వడ్డీ రేట్లను మరింతగా పెంచే అవకాశం ఉన్నందున, ప్రైవేట్ పెట్టుబడులు నెమ్మదిస్తాయని ఏడీబీ అంచనా వేసింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ 7 శాతం వృద్ధిని సాధించనున్నదని ఇండస్ట్రీ బాడీ ఫిక్కీ అంచనావేస్తున్నది. గతంలో 7.4 శాతంగా ఉంటుందని అంచనావేసిన ఫిక్కీ..ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల్లో వృద్ధి అంచనాల్లో కోత విధించింది. మరోవైపు, వచ్చే మార్చి నాటికి రిజర్వుబ్యాంక్ తన రెపోరేటును 5.65 శాతం వరకు పెంచవచ్చునని ఫిక్కీ అంచనావేస్తున్నది. ప్రస్తుతం ఇది 4.90 శాతంగా ఉన్నది. పారిశ్రామికం, బ్యాంకింగ్, ఆర్థిక సేవల రంగాలకు చెందిన ప్రధాన ఆర్థిక వేత్తల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఫిక్కీ ఈ నివేదికను రూపొందించింది. అలాగే వ్యవసాయం, దీనికి అనుబంధ రంగాల వృద్ధిని 3 శాతంగా అంచనావేస్తున్నది ఫిక్కీ.