Adani Power | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9: రుణభారంతో ఎన్సీఎల్టీ దివాలా ప్రక్రియలో ఉన్న లాంకో విద్యుత్ ప్లాంట్ బిడ్‌ను అదానీ గ్రూప్ చేజిక్కించుకుంది. తాజాగా జరిగిన బిడ్ వేలంలో ఈ ప్లాంట్‌ను అదానీ పవర్ రూ.4,101 కోట్లకు దక్కించుకున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. బిడ్స్‌ను సమర్పించిన మరో రెండు సంస్థలు రిలయన్స్ ఇండస్ట్రీస్, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్సీ)లు వేలంలో పాల్గొనకపోవడంతో అదానీ గ్రూప్‌ను విన్నింగ్ బిడ్డర్‌గా ప్రకటించారు.
లాంకో అమర్కంటక్ పవర్ కంపెనీ చత్తీస్‌ఘర్‌లో థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని నిర్వహిస్తున్నది. కంపెనీ లా ట్రిబ్యునల్ 2019 సెప్టెంబర్‌లో లాంకో అమర్కంటక్ పవర్‌ను దివాలా ప్రక్రియకు స్వీకరించగా, పలు కారణాలతో జాప్యం జరుగుతూ వచ్చింది. 2022లో వేదాంత గ్రూప్ అధినేత అనిల్ అగర్వాల్ రూ.3,000 కోట్లు ఆఫర్ చేసినప్పటికీ, ఈ మొత్తం చాలా తక్కువంటూ రుణదాతలు తిరస్కరించారు.
అటుతర్వాత పీఎఫ్సీ బిడ్డింగ్‌లో ఇచ్చిన రూ.3,020 కోట్ల ఆఫర్‌ను 95 శాతం మంది రుణదాతలు ఆమోదించినా, ఎన్సీఎల్టీ ఆ ప్రణాళికను ఆమోదించలేదు. అప్పట్లో రిలయన్స్, అదానీలు వేలంలో పాల్గొనలేదు. తాజా వేలంలో లాంకో ప్రాజెక్టును రుణదాతలు నిర్ణయించిన బేస్ ధరకే అదానీ పవర్ సొంతం చేసుకోవడం గమనార్హం.