Adani-Grant Thornton |తమ గ్రూప్ సంస్థలపై యూఎస్ షార్ట్ షెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణల నుంచి దారి మళ్లించి, ఇన్వెస్టర్లలో విశ్వాసం కల్పించేందుకు గౌతం అదానీ సారధ్యంలోని అదానీ గ్రూప్ సిద్ధమైంది. అందుకు కొన్ని తమ కంపెనీల్లో స్వతంత్ర అడిటింగ్ కోసం అకౌంటెన్సీ సంస్థ గ్రాంట్ థోర్టంట్ను నియమించింది. హిండెన్‌బర్గ్ నివేదిక తర్వాత అదానీ గ్రూప్ సంస్థల స్టాక్స్, బాండ్లు భారీగా పతనమైన సంగతి తెలిసిందే. అదానీ గ్రూప్ సంస్థలు పన్ను స్వర్గధామాలను దుర్వినియోగం చేయడంతోపాటు స్టాక్ మార్కెట్లలో అవకతవకలకు పాల్పడుతున్నాయని గత నెల 24న హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక బహిర్గతం చేసింది. ఈ నివేదికపై తమ వాదనను సమర్థించుకునేందుకు గ్రాంట్ థోర్టంట్ అనే అడిటింగ్ సంస్థ నియామకం అదానీ గ్రూప్ ప్రధాన ఎత్తుగడగా కనిపిస్తున్నది.
బిలియనీర్ గౌతం అదానీ సారధ్యంలోని అదానీ గ్రూప్.. హిండెన్‌బర్గ్ నివేదికను గట్టిగా తోసిపుచ్చినా ఇన్వెస్టర్లలో ఆందోళన కొనసాగుతూనే ఉన్నది. అదానీ గ్రూప్‌లోని ఏడు లిస్టెడ్ కంపెనీలు గత మూడు వారాల్లో దాదాపు 120 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ కోల్పోయింది. అదానీ కంపెనీలకు చట్టపరమైన సమ్మతి, వివిధ సంస్థల లావాదేవీలు, అంతర్గత నియంత్రణలపై తలెత్తిన ఆరోపణల నిగ్గు తేల్చేందుకు స్వతంత్ర అడిటింగ్ చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు గతవారం అదానీ గ్రూప్ ప్రకటించింది. అందులో భాగంగానే తొలిసారిగా గ్రాంట్ థోర్టంట్ నియామకం జరిగినట్లు తెలుస్తున్నది.
కొన్ని అదానీ గ్రూప్ కంపెనీల పనితీరుపై స్వతంత్ర అడిటింగ్ కోసమే గ్రాంట్ థోర్టంట్ను నియమించారని, ఈ నియామకం పూర్తిగా రహస్యం అని ఆ కంపెనీ వర్గాలు తెలిపాయి. వివిధ సంస్థల మధ్య లావాదేవీలు, ఆ లావాదేవీలు కార్పొరేట్ సుపరిపాలన ప్రమాణాలకు లోబడి సాగుతున్నాయా? అన్న అంశాన్ని గ్రాంట్ థోర్టంట్ సమీక్షించనున్నట్లు తెలుస్తున్నది. ఈ అంశంపై అదానీ గ్రూప్ గానీ, గ్రాంట్ థోర్టంట్ గానీ స్పందించలేదు.
వాటాదారుల విశ్వాసం చూరగొనేందుకు అదానీ గ్రూప్ ప్రయత్నాలు మొదలు పెట్టింది. తమ వద్ద నగదు నిల్వలు బాగా ఉన్నాయని, తమ బిజినెస్ ప్రణాళికలకు సరిపడా నిధులు అందుబాటులో ఉన్నాయని అదానీ గ్రూప్ సోమవారం ప్రకటించింది. తమ పోర్ట్‌పోలియోలో పెట్టుబడులపై వాటాదారులకు ఉన్నతమైన రిటర్న్స్ అందిస్తామని స్పష్టం చేసింది. తమ కంపెనీలు పారదర్శకంగా పని చేస్తున్నదని, ప్రతి అంశాన్ని బహిర్గతం చేస్తున్నామని.. ఆర్బీఐ సహా నియంత్రణ సంస్థల దృష్టికి తేవడమే అదానీ గ్రూప్ లక్ష్యంగా కనిపిస్తున్నది. నిధుల దుర్వినియోగం, స్వదేశీ నిధుల మళ్లింపు, వివిధ సంస్థల పేరిట తీసుకునే రుణాలను ఇతర అవసరాలకు మళ్లిస్తున్నారన్న ఆరోపణలను తోసిపుచ్చేందుకే గ్రాంట్ థోర్టంట్ నియామకం జరిగిందని అదానీ గ్రూప్ వర్గాల కథనం.
కానీ, అదానీ గ్రూప్ సంస్థల లావాదేవీలపై నియంత్రణ సంస్థల ఒత్తిళ్లు కొనసాగుతున్నాయి. హిండెన్‌బర్గ్ నివేదికపై దర్యాప్తు చేస్తామని దేశీయ స్టాక్‌మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ధృవీకరించింది. హిండెన్‌బర్గ్ నివేదిక బహిర్గతానికి ముందు, తర్వాత అదానీ గ్రూప్ పరిస్థితులపైన దర్యాప్తు చేస్తామని తెలిపింది. అదానీ గ్రూప్ లిస్టెడ్ కంపెనీలు, ప్రైవేట్ కంపెనీల ఆర్థిక లావాదేవీల్లో `గుర్తు తెలియని భాగస్వాములతో జరిపిన లావాదేవీలు గణనీయంగానే ఉన్నాయని హిండెన్‌బర్గ్ నివేదించింది.