Adani Group | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ): హిండెన్‌బర్గ్ రిపోర్ట్ దెబ్బకు అదానీ గ్రూపు కంపెనీలతోపాటు ఆయన మీడియా సంస్ధలకూ బీటలు వారుతున్నాయి. అదానీ మీడియా సంస్థల్లో ఒకటైన ఎన్డీటీవీ షేర్లు భారీగా పతనమయ్యాయి. అందులో పనిచేస్తున్న ఉన్నతోద్యోగులతోపాటు పలువురు సిబ్బంది ఒక్కొక్కరుగా తప్పుకొంటున్నారు.
అతి తక్కువ సమయంలోనే ప్రపంచ కుబేరుల లిస్టులో మూడో స్థానానికి ఎగబాకిన గౌతమ్ అదానీ..మీడియా రంగంపైనా పట్టు బిగించాలని ఎన్డీటీవీని హస్తగతం చేసుకొన్న విషయం తెలిసిందే. కానీ అనుకోని ఉపద్రవంలా వచ్చిపడిన హిండెన్‌బర్గ్ నివేదికతో ఆయన మీడియా సామ్రాజ్యమూ కుప్పకూలుతున్నది. ఎన్డీటీవీలో పనిచేసే ముగ్గురు ఉన్నత శ్రేణి ఉద్యోగులు తాజాగా రాజీనామా చేశారు. వారితోపాటు ఏండ్లుగా పనిచేస్తున్న మరికొంతమంది సిబ్బంది కూడా బయటకు వెళ్లిపోవడంతో సంస్థ యాజమాన్యం నష్ట నివారణ చర్యలు చేపట్టింది. మరో చానల్‌తోపాటు, ఎన్డీటీవీ ప్రాఫిట్‌ను తిరిగి ప్రారంభించే పనులు వేగవంతంగా జరుగుతున్నాయని, మీడియా వ్యాపారాన్ని అదానీ మరింత విస్తరించేందుకు ప్రణాళికలు వేస్తున్నారని సిబ్బందికి నచ్చజెప్పే ప్రయత్నాలు చేస్తున్నట్టు ఓ ప్రముఖ ఆంగ్ల వెబ్సైట్ పేర్కొన్నది.
ఎన్డీటీవీలో అనిశ్చితి నేపథ్యంలో అదానీ గ్రూపునకు చెందిన మరో మీడియా సంస్థ బీక్యూ ప్రైమ్ సిబ్బంది కూడా ఆందోళన చెందుతున్నట్టు మరో ప్రముఖ వెబ్సైట్ వెల్లడించింది. ఇదిలా ఉండగా, మరో ఆరు నెలల వరకు అదానీ మీడియా గ్రూపుల్లో అనిశ్చిత పరిస్థితులు కొనసాగుతాయని అదానీ వ్యాపారాలను పరిశీలించే మార్నింగ్ కాంటెక్ట్స్ మేనేజింగ్ ఎడిటర్ టీ సురేంద్ర అభిప్రాయపడ్డారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అదానీ మీడియా వ్యాపారాన్ని మరింత విస్తరించే పనులు కొనసాగించడం అనుమానమేనని పేర్కొన్నారు.