న్యూఢిల్లీ, ఏప్రిల్ 22: ప్రముఖ థర్డ్-పార్టీ మెరైన్ సర్వీసెస్ సంస్థ, హైదరాబాద్‌కు చెందిన ఓషియన్ స్పార్కిల్ లిమిటెడ్ (ఓఎస్ఎల్)ను తమ అనుబంధ సంస్థ అదానీ హార్బర్ సర్వీసెస్ సొంతం చేసుకుంటున్నదని అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ (ఏపీసెజ్) శుక్రవారం ప్రకటించింది. ఈ మేరకు ఇరు సంస్థల మధ్య ఓ ఒప్పందం కూడా జరిగింది. డీల్ విలువ రూ.1,530 కోట్లుగా చెప్తున్నారు. కాగా, ఓఎస్ఎల్లోని 75 శాతం వాటాను రూ.1,135.30 కోట్లతో ప్రత్యక్ష పద్ధతిలో కొంటున్న ఏపీసెజ్.. మరో 24.31 శాతం వాటాను రూ.394.87 కోట్లతో పరోక్ష పద్ధతిలో కొంటున్నది. అయితే ఓఎస్ఎల్ మొత్తం విలువను రూ.1,700 కోట్లుగా అంచనా వేశారు. సంస్థ వద్ద ఉన్న నగదు నిల్వల్ని రూ.300 కోట్లుగా తేల్చారు. దేశంలోని అన్ని ప్రధాన పోర్టులతోపాటు 15 మైనర్ పోర్టులు, 3 ఎల్ఎన్జీ టెర్మినల్స్ల్లో ఓఎస్ఎల్ కార్యకలాపాలు సాగుతున్నాయిప్పుడు. ఇదిలావుంటే ఓఎస్ఎల్ సీఎండీ పీ జైరాజ్ కుమార్ ఇకపైనా ఆ సంస్థ బోర్డు చైర్మన్‌గానే కొనసాగనున్నారు.
ఐదేండ్లలో రెండింతలు
ఈ డీల్ నేపథ్యంలో రాబోయే ఐదేండ్లలో అదానీ హార్బర్ సర్వీసెస్, ఓఎస్ఎల్ ఏకీకృత వ్యాపారం రెండింతలు కాగలదన్న ఆశాభావాన్ని ఈ సందర్భంగా ఏపీసెజ్ సీఈవో కరణ్ అదానీ వ్యక్తం చేశారు. ఇది ఏపీసెజ్ వాటాదారులకు పెద్ద ఎత్తున లాభించగలదన్నారు. 1995 జూలై 26న ఏర్పాటైన ఓఎస్ఎల్.. భారత్‌తోపాటు శ్రీలంక, సౌదీ అరేబియా, యెమన్, ఖతార్, ఆఫ్రికా దేశాల్లోనూ సేవలందిస్తున్నది. సొంతంగా 94 వెస్సెల్స్, 13 థర్డ్-పార్టీ వెస్సెల్స్ ఉన్నాయి. దేశవ్యాప్తంగా దీనికి 1,800 మంది ఉద్యోగులున్నారు. కాగా, ప్రస్తుత క్లయింట్లతో 5-20 ఏండ్ల కాంట్రాక్టులను ఓఎస్ఎల్ కలిగి ఉన్నది. టేక్ ఆర్ పే ప్రాతిపదికన ఇవి కొనసాగుతాయని కరణ్ చెప్పారు.
పోర్టులపై గుత్తాధిపత్యం కోసమేనా..?
దేశంలోని అన్ని ప్రధాన వ్యాపార రంగాల్లో తన ఉనికిని చాటుతున్న గౌతమ్ అదానీ.. పోర్టులపై మాత్రం గుత్తాధిపత్యం కోసం పరుగులు తీస్తున్నారు. ఇందులోభాగంగానే ఓఎస్ఎల్ కొనుగోలు అన్న అభిప్రాయాలు మార్కెట్లో గట్టిగా వినిపిస్తున్నాయిప్పుడు. నిజానికి దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ మల్టీ-పోర్ట్ ఆపరేటర్‌గా ఏపీసెజ్ ఉన్నది. గుజరాత్‌లోని ముంద్రా వద్ద భారీ సెజ్ అదానీకి ఉండగా, దేశవ్యాప్తంగా 12చోట్ల అదానీ కార్యకలాపాలు సాగుతున్నాయి. ఇక 10 పోర్టులను నిర్వహిస్తున్న ఏపీసెజ్.. 6 రాష్ర్టాల్లో 45 బెర్త్‌లు, 14 టెర్మినల్స్‌ను కలిగి ఉన్నది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణపట్నం పోర్టును హస్తగతం చేసుకున్న అదానీ.. ఇప్పుడు ఓఎస్ఎల్నూ చేజిక్కించుకున్నారు. దీంతో సముద్ర రవాణాపై అదానీ ప్రభావం మరింత స్పష్టంగా కన్పించనున్నది. 2030 నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద పోర్ట్ నిర్వహణ సంస్థగా, భారత్‌లో అత్యంత భారీ ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్పోర్ట్ యుటిలిటీగా ఎదగాలని ఏపీసెజ్ లక్ష్యంగా పెట్టుకున్నది. ఇటీవలే సంపన్నుల జాబితాలో ముకేశ్ అంబానీని దాటేసి ఆసియా కుబేరుడిగా అదానీ అవతరించిన సంగతీ విదితమే.