హైదరాబాద్, అక్టోబర్ 16: హైదరాబాద్‌లో మరో ఈ బైకుల తయారీ సంస్థ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది. ఇప్పటికే పలు సంస్థలు ఇక్కడ యూనిట్లను నెలకొల్పగా తాజాగా ఏసర్.. నగరంలో అసెంబ్లింగ్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రకటించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కంపెనీ సీవోవో హరి కిరణ్ మాట్లాడుతూ.. వచ్చే 6 నెలల్లో ప్లాంట్ కోసం రూ.120 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టనున్నట్టు చెప్పారు. ప్రస్తుతం సంస్థలో 100 మంది సిబ్బంది ఉండగా, కొత్త యూనిట్ వస్తే 400కి చేరుతుందన్నారు.
దేశీయ ఈ-స్కూటర్ మార్కెట్‌కు ఏసర్ తమ తొలి స్కూటర్ ఎంయూవీఐ 125 4జీని పరిచయం చేసింది. ఈ స్కూటర్ ధరను రూ.99,999గా నిర్ణయించింది. సింగిల్ చార్జ్‌తో 80 కిలోమీటర్లు ప్రయాణించే ఈ స్కూటర్ గంటకు 75 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. బ్యాటరీ చార్జింగ్‌తో ఇబ్బందులు పడుతున్న కస్టమర్లను దృష్టిలో పెట్టుకొని ఈ స్కూటర్లోని బ్యాటరీని వేరు చేసి చార్జింగ్ చేసుకునే వీలు కల్పించినట్టు కంపెనీ సీఈవో ఇర్ఫాన్ ఖాన్ తెలిపారు. వచ్చే 6 నెలల్లో రెండు స్కూటర్లు, ఈ-బైస్కిల్లు, ఈ-బైకులు, ఈ-ట్రిక్స్లను విడుదల చేయనున్నామన్నారు. ప్రస్తుతం ఈ వాహనాలు పుణెలో ఏర్పాటు చేసిన ప్లాంట్‌లో తయారు చేస్తున్నట్టు చెప్పారు. బజాజ్ చేతక్, టీవీఎస్ ఐక్యూబ్, ఒకినవా స్కూటర్లకు పోటీగా సంస్థ ఎంయూవీఐ 125 4జీ విడుదల చేసింది.