Abhishek Bachchan |అభిషేక్ బచ్చన్.. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ తనయుడు.. ప్రముఖ బాలీవుడ్ నటుడు.. విశ్వ సుందరి ఐశ్వర్యారాయ్ బచ్చన్ భర్త. బాలీవుడ్ సినిమాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న అభిషేక్ బచ్చన్.. ముంబైలోని బొరివాలి సబర్బన్ ప్రాంతంలో ఆరు అపార్ట్మెంట్లు కొనుగోలు చేశారు. దేశంలో పేరొందిన ఒబేరాయ్ రియాల్టీ అనుబంధ సంస్థ ‘ఇంక్లైన్ రియాల్టీ’ వద్ద కొనుగోలు చేసిన ఈ ఆరు అపార్ట్మెంట్ల విలువ అక్షరాలా రూ.15.42 కోట్లు.
ఇంక్లైన్ రియాల్టీ చేపట్టిన ఒబేరాయ్ స్కై సిటీ లగ్జరీ ప్రాజెక్టులో 57వ అంతస్తులో 4,984 చదరపు అడుగుల విస్తీర్ణం గల అపార్ట్ మెంట్లు అభిషేక్ బచ్చన్ సొంతం చేసుకున్నారు. ఒక్కో చదరపు అడుగు ధర రూ.31,498. వీటిల్లో రెండు అపార్ట్ మెంట్లు 252 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటే మిగతా నాలుగింటిలో ఒక్కొక్కటి సుమారు 1100 చదరపు అడుగుల కార్పేట్ ఏరియా కలిగి ఉన్నాయి. చిన్న అపార్ట్ మెంట్లు రూ.79 లక్షల చొప్పున చెల్లిస్తే, మిగతా నాలుగు అపార్టు మెంట్లకు ఒక్కో దానికి దాదాపు రూ.3.5 కోట్లు చెల్లించారు. ఈ అపార్టుమెంట్ల కొనుగోలు ప్రక్రియ గత నెల 28న పూర్తయితే 29న రిజిస్ట్రేషన్ పూర్తయిందని జాప్ కీ డాట్ కామ్ ఓ వార్తా కథనం ప్రచురించింది. దీనిపై స్పందించేందుకు అభిషేక్ బచ్చన్ గానీ, ఒబేరాయ్ రియాల్టీ గానీ స్పందించలేదు.
సంపన్నులు పెట్టుబడులు పెట్టడానికి రియల్ ఎస్టేట్ రంగం ప్రధాన మార్గంగా కనిపిస్తుంటుంది. అందులో బాలీవుడ్ ప్రముఖులు కూడా ఉంటారు. ఇండ్లు, అపార్టుమెంట్లు వ్యక్తిగత అవసరాలతోపాటు విలాసవంతమైన పెట్టుబడి వెంచర్లలోనూ బాలీవుడ్ నటులు, నిర్మాతలు, దర్శకులు పెట్టుబడులు పెడుతుంటారు. అమితాబ్ బచ్చన్, షారూఖ్ ఖాన్, శిల్పాశెట్టి, అక్షయ్ కుమార్, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యారాయ్ బచ్చన్ తదితరులు విలాసవంతమైన రియాల్టీ ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టారు. ఇటీవలే బాలీవుడ్ నటుడు- నిర్మాత- పారిశ్రామికవేత్త జాన్ అబ్రహం ముంబైలోని ఖార్ లోకాలిటీలోని టోనీ లింకింగ్ రోడ్డులో రూ.70.83 కోట్ల పైచిలుకు విలువ గల బంగాళా కొనుగోలు చేశారు. రణ్ బీర్ సింగ్, హృతిక్ రోషణ్, రాణి ముఖర్జీ, అలియాబట్, దిషా పఠానీ, జాన్వీ కపూర్ తదితరులూ అత్యంత విలాసవంతమైన ఇండ్లు సొంతం చేసుకున్నారు.