IPO | ముంబై, డిసెంబర్ 18: ఆల్‌టైమ్ రికార్డుస్థాయిలో స్టాక్ మార్కెట్ ట్రేడవుతున్న తరుణంలో సొమ్ము చేసుకునేందుకు తొలి పబ్లిక్ ఆఫర్లు (ఐపీవోలు) క్యూ కట్టాయి. ఇటీవల లిస్టయిన టాటా టెక్నాలజీస్, ఐఆర్ఈడీఏలు వాటి ఐపీవో ధరకు మూడు, నాలుగు రెట్లు పెరిగిన నేపథ్యంలో ఆఫర్లకు సబ్స్క్రయిబ్ చేయాలన్న ఆసక్తి సైతం ఇన్వెస్టర్లలో నెలకొనడంతో హడావుడిగా కంపెనీలు ఐపీవోలును తెచ్చేస్తున్నాయి. ఈ వారంలోనే అరడజనుకుపైగా సిద్ధంకాగా, సోమవారమే మూడు ప్రారంభమయ్యాయి. మరికొన్ని మంగళ, బుధవారాల్లో మొదలవుతున్నాయి. వివరాలు..
మోతిసన్స్ జ్యువెల్లర్స్
Motisons Jewellers Ipo
జైపూర్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఆభరణాల కంపెనీ మోతిసన్స్ జ్యువలర్స్ పబ్లిక్ ఆఫర్ డిసెంబర్ 18న ప్రారంభమయ్యిం ది. ఐపీవోలో రూ.151 కోట్ల సమీకరించి, ఆ మొత్తాన్ని రుణ చెల్లింపులకు, వర్కింగ్ క్యాపిటల్, ఇతర కార్పొరేట్ అవసరాలకు వినియోగించుకోవాలన్నది కంపెనీ ప్రతిపాదన. ఇప్పటికే యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.36 కోట్లు సమీకరించింది. ఒక్కో షేరును రూ.55 ధర వద్ద యాంకర్ ఇన్వెస్టర్లు కొనుగోలు చేశారు.
ముత్తూట్ మైక్రోఫిన్
Muthootfinance
ముత్తూట్ గ్రూప్ సూక్ష్మ రుణ వితరణ సంస్థ ముత్తూట్ మైక్రోఫిన్ రూ.960 కోట్ల సమీకరణకు ఐపీవో తీసుకొచ్చింది. ఇందులో రూ.760 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్లను జారీచేస్తుండగా, రూ.200 కోట్ల విలువైన షేర్లను ఆఫర్ ఫర్ సేల్ రూపంలో ఒక విదేశీ ఫండ్, ప్రమోటర్లు విక్రయిస్తున్నారు. డిసెంబర్ 18న ప్రారంభమైన ఈ ఐపీవో ధర రూ.277-291 శ్రేణిగా నిర్ణయించారు.
సూరజ్ ఎస్టేట్ డెవలపర్స్
ముంబై కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న రియల్టీ కంపెనీ సూరజ్ ఎస్టేట్ డెవలపర్స్ ఐపీవో డిసెంబర్ 18న మొదలయ్యింది. ఒక్కో షేరకు రూ.340-360 ధరల శ్రేణితో రూ.రూ.400 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్లను ఆఫర్ చేస్తున్నది. ఇందులో ఇప్పటికే యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 120 కోట్లు సమీకరించింది. ఈ మొత్తాన్ని రుణ చెల్లింపులకు, సబ్సిడరీల కొనుగోలు, ఇతర కార్పొరేట్ అవసరాలకు వినియోగించాలని కంపెనీ ప్రతిపాదించింది.
హ్యాపీ ఫోర్జింగ్స్
ఆటో విడిభాగాల తయారీ కంపెనీ హ్యాపీ ఫోర్జింగ్స్ రూ. 1,008 కోట్ల సమీకరణకు పబ్లిక్ ఆఫర్ జారీచేస్తున్నది. డిసెంబర్ 21 నుంచి ప్రారంభమయ్యే ఈ ఐపీవోకు షేరు ధరను రూ. 808-850 శ్రేణిగా నిర్ణయించారు. రూ.400 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్లను ఇష్యూ చేస్తుండగా, 71.6 లక్షల షేర్లను ప్రమోటర్లు, ఇతర ఇన్వెస్టర్లు ఆఫర్ ఫర్ సేల్‌గా విక్రయిస్తున్నారు. తాజా ఈక్విటీ ద్వారా కంపెనీ సమీకరించిన నిధుల్ని పరికరాల కొనుగోలుకు, రుణ చెల్లింపులకు, ఇతర కార్పొరేట్ అవసరాలకు ఉపయోగించాలని కంపెనీ ప్రతిపాదించింది.
క్రెడో బ్రాండ్స్
డెనిమ్ బ్రాండ్ ముఫ్టిని మార్కెట్ చేస్తున్న క్రెడో బ్రాండ్స్ మార్కెటింగ్ ప్రమోటర్లు, ప్రస్తుత షేర్హోల్డర్లు ఆఫర్ ఫర్ సేల్ రూపంలో రూ. 550 కోట్ల షేర్లను విక్రయించేందుకు ప్రతిపాదించిన ఐపీవో డిసెంబర్ 19న ప్రారంభమవుతుంది. దేశంలో మిడ్-ప్రీమియం, ప్రీమియం క్యాజువల్ మెన్స్ వేర్ మార్కెట్లో క్రెడో బ్రాండ్స్ ప్రాచుర్యం సంపాదించింది. షేరుకు రూ.266-280 ధరల శ్రేణితో ఈ కంపెనీ ఐపీవో జారీ అవుతున్నది.
ఆర్బీజడ్ జ్యువెల్లర్స్
బీ2బీ, రిటైల్ జ్యువెల్లరీ వ్యాపారం చేస్తున్న ఆర్బీజడ్ జ్యువెల్లర్స్ జారీచేస్తున్న ఐపీవోలో ఒక కోటి షేర్లను ఆఫర్ చేస్తున్నది. షేరుకు రూ.95-100 శ్రేణిలో ఆఫర్‌కు ధర నిర్ణయించారు. డిసెంబర్ 21న ఐపీవో ప్రారంభమై 21న ముగుస్తుంది. ఆఫర్ ద్వారా సమీకరించే నిధుల్ని వర్కింగ్ క్యాపిటల్, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించాలని కంపెనీ ప్రతిపాదించింది.
అజాద్ ఇంజనీరింగ్
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న అజాద్ ఇంజనీరింగ్ ఐపీవో డిసెంబర్ 20న జారీకానుంది. రూ.740 కోట్ల సమీకరణకు ప్రతిపాదించిన ఈ ఐపీవోకు ధరను రూ.499-524 శ్రేణిగా నిర్ణయించారు. రూ.500 కోట్ల విలువైన షేర్లను ఆఫర్ ఫర్ సేల్ రూపంలో ప్రమోటర్లు, ఇతర ఇన్వెస్టర్లు ఆఫర్లో విక్రయిస్తుండగా, రూ. 240 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను కంపెనీ తాజాగా జారీచేస్తున్నది. తాజా ఈక్విటీ ద్వారా సమీకరించే నిధుల్ని విస్తరణకు, రుణ చెల్లింపులకు ఉద్దేశించారు.