న్యూఢిల్లీ, జనవరి 5: కంపెనీ నిర్మాణ వ్యూహంలో కేవలం 17 శాతం బోర్డులే క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాయని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) చేపట్టిన ఓ సర్వేలో తేలింది. దీంతో 83 శాతం కంపెనీల్లోని బోర్డులు ఆ కంపెనీల మేనేజ్మెంట్లో నిష్క్రియాత్మకంగానే ఉంటున్నాయని స్పష్టం చేసింది.
కాగా, ఈ సర్వేలో పాల్గొన్న 36 శాతం డైరెక్టర్లు.. మేనేజ్మెంట్ ప్రణాళికలకు సంబంధించి సమగ్ర వివరాలను పొందలేకపోతున్నామని చెప్పడం గమనార్హం. ‘కార్పొరేట్ గవర్నెన్స్ రిపోర్ట్ 2025-ది బోర్డ్స్ లుకింగ్ గ్లాస్’ పేరిట ఐఎస్బీ ఈ అధ్యయనాన్ని చేసింది. బీఎస్ఈలోని 500 కంపెనీలకు చెందిన 200కుపైగా డైరెక్టర్లు ఇందులో తమ అభిప్రాయాలను పంచుకున్నారు.