ముంబై, ఫిబ్రవరి 17: దేశంలో విదేశీ మారకం నిల్వలు గణనీయంగా పడిపోతున్నాయి. కేవలం వారం రోజుల్లో ఏకంగా 8.32 బిలియన్ డాలర్లు క్షీణించాయి. గడిచిన 11 నెలలకుపైగా కాలంలో భారతీయ ఫారెక్స్ రిజర్వులు ఈ స్థాయిలో దిగజారడం ఇదే తొలిసారి. ఈ నెల 10తో ముగిసిన వారంలో దేశంలో విదేశీ మారకం నిల్వలు 566.95 బిలియన్ డాలర్లకు తగ్గినట్టు ఆర్బీఐ గణాంకాలు చెప్తున్నాయి. అంతకుముందు వారంలో ఇవి 575.27 బిలియన్ డాలర్ల వద్ద ఉన్నాయి. నిజానికి ఫిబ్రవరి 3తో ముగిసిన వారంలోనూ రిజర్వులు 1.49 బిలియన్ డాలర్లు పడిపోయాయి. 2021 అక్టోబర్‌లో భారతీయ ఫారెక్స్ నిల్వలు మునుపెన్నడూ లేనివిధంగా 645 బిలియన్ డాలర్లుగా నమోదైన విషయం తెలిసిందే. అయితే డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ నష్టాలను అరికట్టేందుకు ఆర్బీఐ ఈ ఫారెక్స్ నిల్వలనే వాడుతున్నది. అయినప్పటికీ రుపీ రికార్డు స్థాయిలో క్షీణిస్తున్నది. మరోవైపు ఫారెక్స్ నిల్వలూ తరిగిపోతుండటం ఇప్పుడు ఆందోళనకరంగా మారింది. మరోవైపు బంగారం నిల్వలు 919 మిలియన్ డాలర్లు తగ్గాయి. దీంతో 42.86 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి.