న్యూఢిల్లీ: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆరేళ్ల కిందట డీమోనిటైజేషన్‌లో భాగంగా నాడు చెలామణిలో ఉన్న పెద్ద నోట్లను రద్దు చేసింది. అయినప్పటికీ ప్రజల వద్ద గరిష్ఠంగా నగదు ఉన్నట్లు తేలింది. ఈ ఏడాది అక్టోబర్ 21 నాటికి దేశ ప్రజల వద్ద రూ.30.88 లక్షల కోట్ల నగదు ఉన్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) శుక్రవారం తెలిపింది. 2016 నవంబర్ 8న నాడు చెలామణిలో ఉన్న పాత వెయ్యి, పాత రూ.500 వంటి పెద్ద నోట్లను రద్దు చేసినట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. అవినీతి, బ్లాక్‌మనీని అరికట్టడంతోపాటు నగదు లావాదేవీలను తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
కాగా, 2016 నవంబర్ 4న ప్రజల వద్ద రూ.17.7 లక్షల కోట్ల నగదు ఉందని ఆర్బీఐ తెలిపింది. అయితే
డీమోనిటైజేషన్ జరిగిన ఆరేళ్ల తర్వాత ప్రజల వద్ద నాటి కంటే 71.84 శాతం ఎక్కువగా నగదు ఉన్నట్లు పేర్కొంది. ఈ ఏడాది అక్టోబర్ 21 నాటికి ప్రజల వద్ద చెలామణిలో ఉన్న నగదు రూ.30.88 లక్షల కోట్లకు పెరిగినట్లు వెల్లడించింది. కరోనా తర్వాత డిజిటల్ లావాదేవీలు పెరిగినప్పటికీ దేశ జీడీపీ నిష్పత్తితో పోల్చితే, నగదు లావాదేవీలే ఎక్కువని పేర్కొంది.
మరోవైపు నోట్ల రద్దు తర్వాత కూడా నగదు లావాదేవీలు తగ్గకపోగా, మరింతగా పెరిగినట్లు ఆర్బీఐ నివేదిక ద్వారా తెలుస్తున్నది. కొత్త డిజిటల్ లావాదేవీలు అందుబాటులో ఉన్నప్పటికీ ప్రజలు ఎక్కువగా నగదు లావాదేవీలకే మొగ్గు చూపుతున్నారని, దీంతో నగదు వినియోగం మరింతగా పెరుగుతున్నట్లు ఆర్బీఐ నివేదిక స్పష్టం చేసింది.