WhatsApp- Digital Loans | ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ `వాట్సాప్`.. కేవలం మెసేజ్‌లు పంపడానికి, చాటింగ్ నిర్వహించడానికి ఉపయోగించే వారు. కానీ ఇప్పుడు ఆర్థిక లావాదేవీల్లో కీలకంగా మారుతోంది. ప్రతి ఒక్కరూ వివిధ రకాల రుణాలు తీసుకుంటారు. ప్రస్తుతం ఆర్థిక లావాదేవీలన్నీ ఆన్లైన్లోనే సాగిపోతున్నాయి. అంటే మెజారిటీ డిజిటల్ చెల్లింపులే. డిజిటల్ ఆర్థిక లావాదేవీల్లో వాట్సాప్ ముఖ్యమైన చానెల్‌గా అవతరిస్తోంది. మొత్తం రుణ గ్రహీతల్లో 59 శాతం వాట్సాప్ ద్వారా లోన్ మెసేజ్‌లు అందుకుంటున్నారని `భారత్‌లో రుణాల పంపిణీ ఎలా` అనే అంశంపై హోం క్రెడిట్ ఇండియా నిర్వహించిన అధ్యయనంలో తేలింది. రోజురోజుకు `ఆర్థిక సేవల డిజిటలైజేషన్`ను ఆమోదిస్తున్న వారు పెరుగుతున్నారని ఈ అధ్యయనం పేర్కొంది. అయితే, రుణ గ్రహీతల్లో 25 శాతానికి పైగా రుణాల కోసం ఆన్లైన్ చానళ్లనే ఎంచుకుంటున్నారు.
51శాతం మంది రుణ గ్రహీతలు మొబైల్ యాప్స్‌లోనే తమ రుణ దరఖాస్తులు పూర్తి చేస్తున్నారు. యువతరం, చిన్న పట్టణాల్లోని రుణ గ్రహీతలు ఆన్లైన్ లోన్ మీడియంకు ప్రాధాన్యం ఇస్తున్నారు. డెహ్రడూన్‌లో 61, లుధియానాలో 59 శాతం, అహ్మదాబాద్‌లో 56, చండీగఢ్‌లో 52 శాతం మంది ఆన్లైన్లోనే రుణ లావాదేవీల ప్రక్రియ వైపు మొగ్గు చూపుతున్నారు. అత్యధిక రుణ గ్రహీతలు ఆన్లైన్ రుణాలే సౌకర్యంగా భావిస్తుండగా, 48 శాతం మంది వ్యక్తిగత వస్తువుల కొనుగోళ్లకు ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారు. వీరిలో 44 శాతం మంది ఆర్థిక లావాదేవీలకు ఆన్లైన్ బ్యాంకింగ్‌పైనే ఆధార పడుతున్నారు. రోజువారీ ఫైనాన్సియల్ అప్డేట్స్ కోసం 54 శాతం మంది మొబైల్ బ్యాంకింగ్ సౌకర్యవంతంగా ఉంటుందని భావిస్తున్నారు.
2021 నుంచి గృహోపకరణాలు, స్మార్ట్ ఫోన్లు కన్జూమర్ డ్యూరబుల్స్ కొనుగోళ్లు పెరిగాయి. 2023 నాటికి 44 శాతానికి పెరిగాయి. కన్జూమర్ డ్యూరబుల్ రుణాలు తొమ్మిది శాతం తగ్గితే, వ్యాపార ఆధారిత రుణాలు ఐదు శాతం పెరిగితే, కొత్త వ్యాపారాలు లేదా మధ్య తరగతి వర్గాలు తీసుకునే రుణాలు 19 శాతం పెరిగాయి. ఈ-కామర్స్ షాపింగ్ తేలిక కావడంతో అందరూ అటువైపే మొగ్గుతున్నారు. శరవేగంగా రుణాల పంపిణీకి అధికంగా విశ్వాసం కలుగుతోంది. రుణ గ్రహీతల్లో 49 శాతం మంది రుణాలు తీసుకోవడానికి `ఈఎంఐ కార్డ్స్`మొగ్గు చూపుతన్నారని హోం క్రెడిట్ ఇండియా తెలిపింది.
రుణ గ్రహీతల్లో 18 శాత మాత్రమే డేటా ప్రైవసీ నిబంధనలను అర్థం చేసుకుంటున్నారని హోం క్రెడిట్ ఇండియా తెలిపింది. సుమారు 60 శాతం రుణ గ్రహీతలు లెండింగ్స్ యాప్స్‌ను ఉపయోగించి పర్సనల్ డేటా కలెక్ట్ చేస్తున్నారు. లెండింగ్ యాప్స్ అవసరమైన దానికన్నా ఎక్కువ డేటా సేకరిస్తున్నాయని 58 శాతం రుణ గ్రహీతలు చెబుతున్నారు. 23 శాతం మంది మాత్రమే లోన్ యాప్‌ల్లో తమ పర్సనల్ డేటా ఎలా వాడాలన్న అంశాన్ని అర్థం చేసుకుంటున్నారు. ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, పుణె, అహ్మదాబాద్, లక్నో, జైపూర్, పాట్నా, భోపాల్, రాంచీ, చండీగఢ్, లుధియానా, కొచి, డెహ్రాడూన్ నగరాల పరిధిలో ఈ అధ్యయనం సాగింది.