ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఆర్థిక క్రమశిక్షణ ఉండాల్సిందే. లేకపోతే తెగిన గాలిపటమే అవుతాం. ముఖ్యంగా కరోనా నేపథ్యంలో ఆర్థిక పరిపుష్ఠి అందరికీ అత్యంత ఆవశ్యకమైంది. అందుకు ఈ ఐదు సూత్రాలు దోహదపడతాయి.
1. అవగాహన
మన ఆర్థిక అవసరాలపై తప్పక అవగాహన ఉండాలి. లేదంటే పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోవడం ఖాయం. అవగాహనతోనే డబ్బు విలువను తెలుసుకోగలం. ఆత్మవిశ్వాసాన్నీ పెంపొందించుకోవచ్చు. ఇంట్లో ఉన్న పెద్దల్ని చూసే పిల్లలు పెరుగుతారు. కాబట్టి ధనం విషయంలో మన ప్రవర్తన పిల్లల్నీ ప్రభావితం చేస్తుందని మరువద్దు.
2. రుణ పరపతి
ఎంచుకున్న లక్ష్యాల సాధనకు మన రుణ పరపతి ఎంతగానో తోడ్పడుతుంది. ఆర్థిక క్రమశిక్షణ ఉంటే రుణ పరపతి తప్పకుండా మెరుగ్గానే ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. రుణాలను పొందడంలో మన క్రెడిట్ స్కోర్దే కీలకపాత్ర. దీని ఆధారంగానే మన ఆర్థిక అవసరాలపైనా రుణదాతలు ఓ అంచనాకు వస్తారు. కాబట్టి రుణ పరపతి దెబ్బతినేలా ఎప్పుడూ వ్యవహరించరాదు.
3. బడ్జెట్-ఖర్చులు
ప్రతిదానికీ ఓ లెక్కుండాలి. దేశమైనా.. రాష్ట్రమైనా.. చివరకు ఇైల్లెనా. అందుకే బడ్జెట్-ఖర్చులకు అంతటి ప్రాధాన్యత. ఏది అవసరం.. మరేది అనవసరం అన్న తేడా తెలియాలన్నా.. ఆదాయ-వ్యయాల మధ్య వ్యత్యాసాలను గుర్తించాలన్నా బడ్జెట్ తప్పనిసరి. ఓ రకంగా ఖర్చుల నియంత్రణకూ ఇది సహకరిస్తుంది.
4. రుణాల చెల్లింపులు
అత్యవసరమైతే తప్ప రుణం తీసుకోకపోవడమే మంచిది. చేతిలో నగదుంటే రుణాల్ని తీర్చేయడమే ఉత్తమం. మన ఆదాయం ఎంత?.. ఖర్చులు ఎంత?.. అన్నది తెలుసుకుని ప్రవర్తిస్తే రుణాల ముప్పు నుంచి బయటపడవచ్చు.
5. పొదుపు-మదుపు
అత్యవసర సమయాల్లో మనల్ని కష్టాల నుంచి గట్టెక్కించేది పొదుపు-మదుపే. చిన్న వయసు నుంచే పొదుపు భారీ లాభాల్ని తెచ్చిపెడుతుంది. పెట్టుబడులకూ ఇది వర్తిస్తుంది. జీవిత, ఆరోగ్య బీమాలూ ఆర్థిక క్రమశిక్షణలో భాగమే.