హైదరాబాద్, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ): సొంతగా కంపెనీలను స్థాపించి వ్యాపార, పారిశ్రామికవేత్తలుగా ఎదగాలనుకొంటున్న ఔత్సాహికులకు ఆయా రంగాలపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించి తగిన చేయూతనివ్వడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. దీనిలో భాగంగా యువతకు శిక్షణ ఇచ్చేందుకు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ)తో ఒప్పందాన్ని కుదుర్చుకొన్నది. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్, ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్ సమక్షంలో రాష్ట్ర సాంకేతిక విద్య కమిషనర్ నవీన్ మిట్టల్, ఐఎస్బీ డీన్ ప్రొఫెసర్ మదన్ పిల్లుట్ల శుక్రవారం ఈ ఒప్పంద పత్రాలను మార్చుకొన్నారు. దీనిలో భాగంగా ఎంటర్ప్రెన్యూర్ లిటరసీ, బిజినెస్ లిటరసీ, డిజిటల్ లిటరసీ, బిహేవియరల్ స్కిల్స్ అనే నాలుగు కోర్సులను ఐఎస్బీ నిర్వహించనున్నది. వీటిని పూర్తిచేసినవారికి ఐఎస్బీ, సాంకేతిక విద్యామండలి సర్టిఫికెట్లను జారీచేస్తాయి. ఫిబ్రవరి నుంచి ఆన్లైన్లో ఈ కోర్సులు జరుగుతాయి. కరోనా తీవ్రతను బట్టి ప్రత్యక్ష పద్ధతిలోనూ తరగతులు ఉంటాయి.
కొలువులిచ్చే కోర్సులు
నైపుణ్యాలను పెంపొందించేందుకు నిర్వహిస్తున్న ఈ కోర్సుల్లో విద్యార్థులతోపాటు ఔత్సాహికులెవరైనా చేరవచ్చు. ఇవి పూర్తిగా కొలువులిచ్చే కోర్సులు. 40 గంటల వ్యవధి గల ఈ కోర్సులను ఆన్లైన్లో నేర్చుకోవచ్చు. కోర్సు పూర్తికాగానే సర్టిఫికెట్ జారీచేస్తాం. ఐఎస్బీ నిర్వహిస్తున్న కోర్సు కాబట్టి మార్కెట్లో మంచి విలువ, డిమాండ్ ఉంటుంది.
2 లక్షల మందికి శిక్షణ
కరోనా తర్వాత వస్తున్న కొత్త వ్యాపార విధానాలను దృష్టిలో పెట్టుకొని ఈ కోర్సులను అందుబాటులోకి తీసుకొచ్చాం. ఉద్యోగావకాశాలను పెంపొందించడమే లక్ష్యంగా వీటిని నిర్వహిస్తున్నాం. తాజా ఒప్పందం ద్వారా 50 వేల నుంచి 2 లక్షల మంది విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇవ్వాలని భావిస్తున్నాం.