IPO | ముంబై, జూన్ 24: ఈ ఏడాది సెకండరీ మార్కెటే కాదు.. ప్రైమరీ మార్కెట్ కూడా దుమ్మురేపింది. బీఎస్ఈ ప్రధాన సూచీ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీలు సరికొత్త స్థాయిల్లో కదలాడుతున్నాయి. మరోవైపు స్టాక్ మార్కెట్లలోకి రికార్డు స్థాయిలో ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్లు (ఐపీవో) వచ్చేస్తున్నాయి. ఎంతలా అంటే గడిచిన 17 ఏండ్లలో ఇదే అత్యుత్తమ ప్రథమార్ధం (జనవరి-జూన్)గా నిలిచింది. ఈ ఏడాది జనవరి మొదలు ఇప్పటిదాకా 37 సంస్థలు పబ్లిక్ ఇష్యూకు వచ్చాయి. ఇందులో కో-వర్కింగ్ స్పేస్, ఫర్నీచర్ రిటైలింగ్, ఆన్లైన్ టికెట్ బుకింగ్ వంటి కంపెనీలూ ఉండటం విశేషం. ఇవన్నీ కలిసి దాదాపు రూ.32,000 కోట్ల నిధులను సమీకరించడం గమనార్హం. ఈ వారంలోనే మూడు ఐపీవోలు ముగిశాయి.
2007 తర్వాత..
2007 ప్రథమార్ధంలో గరిష్ఠంగా 54 సంస్థలు దేశీయ స్టాక్ మార్కెట్లలోకి ఐపీవోల ద్వారా ప్రవేశించాయి. నాడు అవి సమీకరించిన నిధులు రూ.20,833 కోట్లు. మళ్లీ ఆ తర్వాత ఇప్పుడే ఆ స్థాయిలో కంపెనీలు ఈక్విటీ మార్కెట్లలోకి వచ్చాయి. అయితే 2022 జనవరి-జూన్‌లో 16 సంస్థలే వచ్చినా రూ.40,311 కోట్ల నిధుల సమీకరణ జరిగింది. ప్రభుత్వ జీవిత బీమా దిగ్గజం ఎల్ఐసీ ఐపీవో కలిసొచ్చింది. ఈ ఒక్క పబ్లిక్ ఇష్యూ విలువే రూ.21,000 కోట్లు. ఇది గనుక లేకపోతే ఐపీవో మార్కెట్లో 6 నెలల్లో సమీకరించిన నిధులపరంగా ఈ ఏడాదే అత్యుత్తమం. ఇక గత ఏడాది ప్రథమార్ధంతో పోల్చితే ఈ ఏడాది ఫండింగ్ నాలుగు రెట్లు ఎగిసింది. దేశ, విదేశీ మదుపరుల మద్దతే ఇందుకు కారణం. స్టాక్ మార్కెట్ల రికార్డు లాభాలూ కారణమే. ఈ లాభాలకు ఆకర్షితులయ్యే మరిన్ని సంస్థలు ఐపీవోలకు సిద్ధమైనట్టు మార్కెట్ నిపుణులు తాజా ట్రెండ్‌ను విశ్లేషిస్తున్నారు. పైగా గతంలో పార్లమెంట్ ఎన్నికలు జరిగిన ఏ ఏడాది ప్రథమార్ధంలోనూ ఈసారి నమోదైనదాంట్లో నాల్గో వంతు కూడా పబ్లిక్ ఇష్యూలు, నిధుల సమీకరణ జరుగలేదు.
క్యూలో మరికొన్ని..
హ్యుందాయ్ ఇండియా, స్విగ్గీ, ఓలా తదితర ప్రముఖ సంస్థలన్నీ ఐపీవోలకు క్యూ కట్టాయి. ఇందులో హ్యుందాయ్ పబ్లిక్ ఇష్యూ దేశ స్టాక్ మార్కెట్ల చరిత్రలోనే అతిపెద్దది కానుండటం గమనార్హం. ప్రస్తుతం ఎల్ఐసీ పేరిట ఉన్న భారీ ఐపీవో రికార్డూ చెరిగిపోనున్నది. అయితే వచ్చే నెల రాబోయే కేంద్ర బడ్జెట్.. ఐపీవోల దూకుడుకు కాస్త బ్రేకులు వేయవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, ఈ ఏడాదిలో ఇప్పటిదాకా సెన్సెక్స్ 6.8 శాతం, నిఫ్టీ 8.1 శాతం పుంజుకున్నాయి. ఇక 20 శాతానికిపైగా నిఫ్టీ మిడ్‌క్యాప్ 100, 20.5 శాతం మేర స్మాల్‌క్యాప్ 100 పెరిగాయి. స్టాక్ మార్కెట్లలో కొత్తగా లిస్టింగైన కంపెనీలూ.. మదుపరులకు ఆకర్షణీయ రాబడులనే అందిస్తున్నాయి. బీఎస్ఈ ఐపీవో సూచీ ఈ ఏడాది 21.8 శాతం ఎగబాకింది. నిధుల సమీకరణలో ఆర్థిక రంగ సంస్థలదే నాల్గో వంతు (రూ.7,879 కోట్లు) వాటాగా ఉన్నది.
దేశీయ సంస్థలు, కుటుంబ వ్యాపారస్తులు, అపర కుబేరుల (హెచ్ఎన్ఐ) వద్ద కావాల్సినంత నగదు నిల్వలున్నాయి. దీంతో పబ్లిక్ ఇష్యూలకు విశేష ఆదరణ లభిస్తున్నది. దీన్నిచూసి మరిన్ని సంస్థలు ఐపీవోలకు క్యూ కడుతున్నాయి. ఈ ఏడాది ఇలాగే సాగితే సరికొత్త రికార్డులు ఖాయం.
– చిరాగ్ నేగంది, జేఎం ఫైనాన్షియల్ ఎండీ